ఏపీలో పొలిటికల్ గ్రాఫ్ మారబోతోందా ? ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకోబోతున్నాయా ? దూరమైన మిత్రులు దగ్గర కాబోతున్నారా ? మళ్ళీ కూటమి దిశగా అడుగులు వేస్తున్నారా ? పవన్ సంచలన వ్యాఖ్యలు వెనుక అసలు రహస్యం ఏమిటి ? వైసీపీని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలిస్తుందా ?
ఏపీ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలయ్యింది. నిన్నటి వరకు ఒకలా ఉన్న రాష్ట్ర రాజకీయాలు జనసేన 8 వ ఆవిర్భావ సభ్యత్వ ఒక్కసారిగా వేడెక్కాయి.వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని.. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తే పొత్తు గురించి ఆలోచిస్తామని, 2019లో లాగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయని, పార్టీల మధ్య పొత్తులు ఖాయమంటూ ఎవరికి వారు ఇప్పటి నుంచే లెక్కలు కూడా వేసుకుంటున్నారట.
నిజానికి వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ ను గద్దెదించేందుకు వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలంటూ పవన్ పిలుపునిచ్చారు. దీంతో పవన్ తన వ్యాఖ్యల ద్వారా పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బిజెపి రోడ్ మ్యాప్ తో తాను ముందుకు వెళ్లబోతున్నా అని పవన్ చెప్పినప్పటికీ తెలుగుదేశంపార్టీ తో కూడా కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందనే చర్చ అటు జనసైనికుల్లో, ఇటు తెలుగు తమ్ముళ్లలో కూడా మొదలయ్యిందట. కాగా ఈ మూడు పార్టీలు మళ్ళీ కలిస్తే ఖచ్చితంగా జగన్ కు గడ్డు పరిస్థితులు తప్పవు అనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పై వామపక్షాలు కూడా కొంత గుర్రుగానే ఉన్నాయి. అనేకమార్లు వారి పోరాటాలను అడ్డుకోవడం, అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలు చేయడంతో వారు ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు వీరందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు అనుకూలంగా మలుస్తున్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే వైసీపీలోని సీనియర్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారంతా తమతో కలుస్తారని బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనల నేపధ్యంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి..ఇక తాజాగా జరిగిన వైసీపీ లేజిస్లేటివ్ ప్లీనరీలో సిఎం జగన్ సొంత పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారని కొందరుఅధికార పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.అదేసమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే అసంతృప్తులు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.ఈ నేపధ్యంలో వీరంతా ఏకమైతే జగన్ ను ఖచ్చితంగా గద్దె దించగలం అనే నమ్మకం అయితే ప్రతిపక్ష నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తానికి ఓటు చీల్చం అని పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వైసీపీని ఎలాగైనా గద్దె దించేందుకు అన్ని పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని, అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో జగన్ కు ఘోర పరాభవం తప్పవనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
Must Read:-జగన్ ఇంకెన్ని సారా చావులు కోరుకుంటున్నావు – నారా లోకేష్