ఎంత టాప్ మోస్ట్ డైరెక్టర్ కయినా.. కాలం కలిసిరాకపోతే… బ్యాక్ టు పెవిలియనే అని చాలా సార్లు రుజువైంది. అప్పట్లో ఫుల్ రేజ్ లో ఉన్న కొందరు స్టార్ డైరెక్టర్స్ .. కథల విషయంలో శ్రద్ధ పట్టకపోవడంతో.. వరుస పరాజయాలు కొని తెచ్చుకున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస హిట్స్ తో రాజభోగాలు అనుభవించిన ఈ దర్శకులు .. ఒకే ఒక్క అవకాశం అంటూ.. స్టార్ హీరోల చుట్టూ తిరిగి.. ఎట్టకేలకు అవకాశాలైతే అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం తమని తాము ప్రూవ్ చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. మరి పోయిన చోటే తిరిగి వెతుక్కొనే పనిలో ఫుల్ బిజీగా ఉన్న ఆ దర్శకులెవరో చూసేద్దాం…
మాస్ కా బాప్ వివి వినాయక్
వివి వినాయక్ అనగానే ఫ్యాక్షన్ విత్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ గుర్తుకొస్తాయి. అసలు అతగాడు దర్శకుడిగా పేరు తెచ్చుకున్నది అలాంటి సినిమాలతోనే. సుమోల్ని గాల్లోకి లేపడం, కత్తులతో, బాంబ్ లతో ప్రత్యర్ధుల భరతం పట్టడం.. ఇవన్నీ ఆయన సినిమాలకు ప్రధాన బలంగా నిలిచేవి. అయితే రాను రాను వినాయక్ సినిమాలు బోర్ కొట్టేయడంతో .. కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే మధ్యలో చిరంజీవి ‘ఠాగూర్, ఖైదీనెంబర్ 150’ లాంటి సినిమాలు ఆయన్ను ఆదుకొన్నాయనుకోండి. వినాయక్ ‘ఇంటెలిజెంట్’ ఫ్లాప్ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆయన్ను మళ్లీ మెగాస్టారే ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ కు దర్శకత్వం వహించే బాధ్యతను వినాయక్ కే అప్పగించారు చిరు. ఒరిజినల్ సినిమాను మన నేటివిటీకి తగ్గట్టు గా మార్చి.. స్ర్కిప్ట్ సమకూర్చుతున్నాడు వినాయక్. ఈ సినిమాతో వివి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
సురేష్ ప్రొడక్షన్స్ అడ్డాలో శ్రీకాంత్ అడ్డాల
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఫ్యామిలీ వేల్యూస్ ను , హ్యూమన్ రిలేషన్స్ ను ఎమోషనల్ గా ఆవిష్కరించడంలో దిట్టయిన ఈ దర్శకుడికి ముకుంద, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు .. ఘోర పరాజయాల్ని మిగిల్చాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవం సినిమా విషయంలో ఈ దర్శకుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు. అయితే అతడి ప్రధాన బలమైన ఫ్యామిలీ ఎమోషన్ సెంటిమెంటే . మళ్ళీ అతడికి మంచి సినిమాను చేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వెంకీతో ‘నారప్ప’ తెరకెక్కించే చాన్స్ దక్కించుకున్నాడు. తమిళ అసురన్ సినిమాకి ఇది రీమేక్ వెర్షన్. ఒరిజినల్ లో ధనుష్ పండించిన సెంటిమెంట్ ను నారప్ప విషయంలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
హిట్టు కోసం ఆరాటపడుతోన్న బొమ్మరిల్లు భాస్కర్
‘బొమ్మరిల్లు’తో టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా ముద్ర పడ్డాడు బొమ్మరిల్లు భాస్కర్ . అయితే దర్శకుడిగా సక్సెస్ ను సస్టెయిన్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పరుగు పర్వాలేదనిపించుకున్నా.. ‘ఆరెంజ్, ఒంగోలు గిత్త లాంటి సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. అయితే అప్పటి నుంచి టాలీవుడ్ లో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎట్టేకేలకు అక్కినేని అఖిల్ నాలుగో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ తో తిరిగి హిట్టందుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
మెగా ఛాన్స్ అందుకున్న మెహర్ రమేశ్
‘బిల్లా, క్రాంతి, శక్తి, షాడో’ లాంటి సినిమాలతో ఘోర పరాజయాలు మూటగట్టుకోవడంతో పాటు .. దర్శకుడిగా దారుణమైన ట్రాక్ రికార్డు కు కూడా బాధ్యుడయ్యాడు మెహర్ రమేష్. ఆ నాలుగు సినిమాల తర్వాత అతడితో సినిమా చేయడానికి ఒక్క స్టార్ హీరో కూడా.. ఇప్పటి వరకూ ధైర్యం చేయలేకపోయాడు. అతడి సుడి ఇప్పుడు మామూలుగా లేదు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టయింది అతడి పొజీషన్. మెగాస్టార్ చిరంజీవి .. మెహర్ రమేష్ లాంటి ఫ్లాప్ దర్శకుడికి ఛాన్సివ్వడమే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.
అజిత్ నటించిన వేదాళం తమిళ సినిమాకి రీమేక్ వెర్షన్ నే ఇప్పుడు మెహర్ చిరుతో చేయబోయే సినిమా. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా ఒరిజినల్ వెర్షన్ లో మార్పు చేసి స్ర్కిప్ట్ రాసుకున్నడు మెహర్ . దాన్ని చిరంజీవి ఓకే చేసారని. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కించమని మెహర్ కు చిరంజీవి స్ట్రిక్ట్ గా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారట. మరి బంగారం లాంటి ఈ అవకాశాల్ని ఈ దర్శకులు ఎలా సద్వినియోగం చేసుకుంటారో? వాళ్ళకు మంచి రోజలు వస్తాయో లేదో చూడాలి.











