టీఆర్ఎస్కు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక, వరంగల్–ఖమ్మం–నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు జీహెచ్ఎమ్సీ ఎలక్షన్స్ అధికార టీఆర్ఎస్కు చాలా ముఖ్యం. టీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీలు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ప్రజల్లో అధికార టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ ఎన్నికల్లో గతంలోలాగా ఏకపక్షంగా గెలిచే అవకాశం టీఆర్ఎస్కు లేదు. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. ప్రజల్లో అధికార పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
హోరాహోరీ
దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వానేనా అన్నట్లుంది. ఇక వరంగల్–ఖమ్మం–నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కూడా టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డినే ఈసారి కూడా పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అయితే గతంలో ఆయన గెలిచినంత సులభం కాదు ఈసారి ఎన్నిక. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో కావడంతో గ్రాడ్యుయేట్స్ నుంచి అధికార పార్టీకి ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతిపక్షాలు కూడా సరైన అభ్యర్థిని రంగంలోకి దింపి ఎలాగైనా టీఆర్ఎస్ను ఓడించాలని చూస్తున్నాయి. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకున్నా ఒకవైపు కోదండరామ్, ప్రొఫెసర్ నాగేశ్వర్, తీన్మార్ మల్లన్న(నవీన్) వంటివాళ్లు ఈసారి ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నారు. వీళ్లలో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రొ.నాగేశ్వర్‌కు మద్దతిస్తుండగా, కాంగ్రెస్ కోదండరామ్ వైపు నిలిచే ఛాన్స్ ఉంది. దీంతో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడంపై టీఆర్ఎస్కు పూర్తి నమ్మకం లేదు. వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన అధికార పార్టీ నేతలతో ఇటీవలే సమావేశం కూడా జరిగింది. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్ వంటివాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవలి వర్షానికి వరంగల్ నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ అంశం స్థానికుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేందుకు కారణమైంది. ఇది కొంతమేరైనా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ బాగానే శ్రమించాలి.
గ్రేటర్ ఎన్నికలు
మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఈసారి మాత్రం ప్రభుత్వానికి అంత సులభం కాదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చని విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరం పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలుస్తూనే ఉంది. రోడ్లు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇన్నేళ్లలో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇక్కడా టీఆర్ఎస్కు పరిస్థితి ఏమంత అనుకూలంగా లేదు. అయితే ఎన్నికల సమయానికల్లా పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్దిట్ట. చివరి నిమిషంలో తన ప్రణాళికలు అమలు చేసి గెలవగల నేర్పు ఆయన సొంతం. అలాంటిదేదైనా ఉంటే ఎన్నికల్లో గెలుపు కేసీఆర్‌కు సులువే. అయితే అన్నిసార్లూ అదే మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా? అన్నట్లు నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో కేసీఆర్ కూతురు కవిత గెలుపొందడం ఆటు కేసీఆర్‌కు, ఇటు టీఆర్ఎస్కు కాస్త ఊరటనిచ్చే అంశం.