నవంబర్ మూడో తేదీన అంటే మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. అమెరికా చరిత్రలో ఇవి 59వ అధ్యక్ష ఎన్నికలు. 59వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ (78) పోటీపడుతున్నారు.
ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌నే ఎంపిక చేసుకున్నారు. బిడెన్ మాత్రం తొలిసారిగా ఓ భారతీయ అమెరికన్ కమలా హారిస్‌ను ఎంపిక చేశారు. బరిలో లిబర్టేరియన్ పార్టీ తరఫున జో జార్గెన్‌సన్, గ్రీన్‌పార్టీ తరఫున హౌవీ హాకిన్స్ ఉన్నా వారి పోటీ నామమాత్రమే. ఆసక్తికరమైన ఈ రణరంగం అమెరికానే గాక, ప్రపంచ రాజకీయాల్ని కూడా శాసించనుంది. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి గెలచిన వ్యక్తికి రెండోసారి అవకాశం ఇవ్వాలని అమెరికన్లు భావిస్తుంటారు. మరి, ఈ సారి ట్రంప్ ఆ సానుకూలాంశాన్ని వాడుకుంటారో, లేదో చూడాలి.
వ్యాక్సిన్ పాలిటిక్స్
అమెరికా ఎన్నికలు మొత్తం కరోనా వ్యాక్సిన్ చుట్టూనే తిరుగుతున్నాయి. స్వయంగా అమెరికా అధ్యక్షుడే కరోనా బారిన పడడంతో అమెరికన్లు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ వ్యాక్సిన్ విషయంలో చాలా తొందరపడుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్ కొవిడ్ వ్యాక్సిన్‌ను బ్రహ్మాస్త్రంగా వాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కొవిడ్ నియంత్రణలో ట్రంప్ సర్కారు విఫలమైందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. వైర్‌స్‌పై ప్రజలను అప్రమత్తం చేయడంలో, వైద్య సేవలు అందించడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఈ విషయం ట్రంప్ కూడా గ్రహించారు. అందుకే.. ఏ కరోనా అయితే తనకు చెడ్డపేరు తెచ్చిందో దాన్నే ఆయుధంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఏళ్లు పట్టే వ్యాక్సిన్ తయారీని నెలల్లో పూర్తి చేయాలంటూ ఫార్మా కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. వంబరు 1 నాటికి కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్రాలు సిద్ధం కావాలంటూ ట్రంప్ సర్కారు సూచించింది. అయితే అమెరికా ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ విడుదలయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి.
ట్రంప్‌కు అవకాశాలున్నాయా..?
జాతీయవాద నినాదం, అమెరికా ఫస్ట్ నినాదంతో స్థానికతను ఆయుధంగా చేసుకుని గెలుపొందారు ట్రంప్. తన నినాదాల ఆధారంగానే పాలన సాగించారు. విదేశాల్లో అమెరికా చేస్తున్న ఖర్చును తగ్గించారు. అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించారు. నాటోకిస్తున్న సొమ్ములో కోత, డబ్ల్యుహెచ్‌వో లాంటి సంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేత వంటివి ట్రంప్ పరపతిని పెంచాయి. సిరియా, అఫ్గానిస్థాన్‌లలో సేనల ఉపసంహరణ వల ఆర్థిక భారాన్ని తగ్గించారు. అలాగే భారత్‌తో స్నేహం కూడా ట్రంప్ వ్యూహంలో భాగమే. కొవిడ్‌కు ముందు అమెరికా ఆర్థిక స్థితి బలంగా ఉంది.
అనుకోని అవాంతరంలా కోవిడ్ వచ్చి పడడంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. ఇప్పటి వరకు 2.03 లక్షల మంది అమెరికన్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇక, కొవిడ్ వల్ల ఉద్యోగాలు పోయి ఎంతో మంది రోడ్డున పడ్డారు. వివిధ రాష్ట్రాలతో విరోధం తెచ్చుకున్నారు. ఉక్రెయిన్ విషయంలో అభిశంసన ఎదుర్కొన్నారు. అభిశంసన మచ్చ పడి మళ్లీ బరిలో దిగిన అధ్యక్షుల్లో ట్రంప్ రెండోవారు కావడం గమనార్హం. ఇక, ట్రంప్ వ్యక్తిగత జీవనంలో లోపాలు ఎప్పటికప్పుడు తెర పైకి వస్తూనే ఉన్నాయి. అనేకమంది మహిళలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక, ముందూ వెనుకా ఆలోచించకుండా ట్వీట్లు చేసి ఇబ్బందుల పాలవడం తరచుగా జరుగుతోంది. ఇక, జాతి వివక్ష, నల్లజాతి వారిపై దాడులు ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతకు కారణం.
భారతీయ ఓటరు ఎటు..?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఓటర్లు కీలకం. ఏకంగా 12 లక్షల మంది భారతీయ ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. వీరిని ఆకట్టుకునేందుకే బిడెన్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక, హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ తీరుపై భారతీయులు చాలా కోపంగా ఉన్నారు. `హైర్ అమెరికన్` నినాదంలో భాగంగా విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్1-బీ, ఎల్1, ఓపీటీలపై ఆంక్షలు విధించటానికి సిద్ధమయ్యారు. హెచ్1-బీ, ఎల్1, ఓపీటీలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఎక్కువే. అలాగే గ్రీన్‌కార్డుల మంజూరుపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక అమెరికాలోని కంపెనీలకు సేవలు అందించటానికి మన దేశ నిపుణులకు ఎల్1 వీసాలు ఇస్తారు. వీటిపై కూడా ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. హెచ్1బీ నిబంధనలను కఠినతరం చేయడంతో.. ఆ వీసాలను స్పాన్సర్ చేయటానికి కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తీరుపై భారతీయ అమెరికన్లు చాలా ఆగ్రహంగా ఉన్నారు. `ఏషియన్ అమెరికన్స్ అండ్ పాసిఫిక్ ఐలండర్స్` (ఏఐపీఐ) అనే సంస్థ సర్వే ప్రకారం భారతీయుల మద్దతు ట్రంప్‌కు 30శాతం, బిడెన్‌కు 70శాతం ఉందని తేలింది.
ట్రంప్ కంటే జో బిడెన్ ఆధిక్యంలో ఉన్నట్టు ఎన్నో ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. సగటున ట్రంప్ కంటే 6 శాతం అధికంగా బిడెన్ ప్రజాదరణ సాధించినట్లు వెల్లడవుతోంది. మరి, ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకుని ట్రంప్ తన ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తారో చూడాలి.











