శాశ్వత కమిషన్ లో మహిళలకు గుర్తింపునివ్వాలని ఫిబ్రవరిలో చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. ఆ తర్వాత కూడా వివక్షని ఎదుర్కొంటున్నారు కొందరు మహిళలు. తిరిగి న్యాయపోరాటంకి సిద్ధమైంది మహిళా లోకం. మరి వారెదుర్కొన్న వివక్ష ఏమిటి? వారి సమస్య ఏమిటో చూద్దాం రండి…
దశాబ్దంపైగా పోరాటం
దాదాపు 300 పైగా మహిళలు, కలసికట్టుగా కదిలారు. కేవలం సేవలు అందుకోవడమే కాదు, దానికి తగ్గ గుర్తింపు కావాలని సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఆర్మీలో మహిళలు సేవలందిస్తున్నా కూడా వారికి శాశ్వత పదోన్నతులు అందడం లేదు. అందుకోసం దాదాపు 14 సంవత్సరాలు పోరాటం చేశారు. సుదీర్ఘ కాలం వాదోపవాదనలు అనంతరం ఫిబ్రవరి 17 వ తేదీన మహిళలకు కూడా శాశ్వత పదోన్నతలు అందించాలని సంచలన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు.
అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రభుత్వం
శారీరిక బలహీనతలను, పిల్లలు… ఇలా ఎన్నో సమస్యలు మహిళలకు ఉంటాయని ప్రభుత్వం అభ్యంతరాలుగా కోర్టుకు చూపింది. వాటిని తోసిపుచ్చిన కోర్టు, ముందు ఆడవారి పట్ల మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మహిళల గురించి ప్రభుత్వ ఆలోచనలే ఇలా ఉంటే సామాన్యులకు మీరు ఎటువంటి మార్గదర్శకాలు చూపుతున్నారని ప్రశ్నించింది. మహిళల శాశ్వత పదవుల ఎంపిక వెంటనే అమలుకావాలని ఆదేశించింది. వారి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని, పని చేసిన కాలాన్ని బట్టి కాదని స్పష్టం చేసింది.
వీరే అర్హులు
వెంటనే ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం, 31 బ్యాచెస్ లో 10 రకాల ఆర్మీ రంగాల్లో పనిచేస్తున్న 615 మందికి గాను, 422 మంది శాశ్వత పదవులు పొందడానికి అర్హులంటూ నవంబర్ 19న అధికారకంగా ప్రకటించింది. దీన్ని చూసిన మిగిలిన వారు ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమన్నారు. దానికి సమాధానంగా అధికారులు, నిజానికి 50 శాతం కంటే తక్కువ మందిని గుర్తించామని, కానీ కొన్ని గణాంకాల ద్వారా ఇంకొదరికి అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. ఆర్మీ లో దాదాపు 20-25 సంవత్సరాలుగా సేవలందిస్తున్నవారు ఉన్నారు. కానీ మగవారి విషయంలో ఇవే సేవలకు దాదాపు 90 శాతం మంది ఎంపిక కావడం గమనార్హం.
మాకు న్యాయం చేయండి
మహిళల శాశ్వత ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ తిరిగి కోర్టు మెట్లెక్కారు మహిళలు. పోరాటం చేయనిదే కనీసం గుర్తింపు కూడా దక్కదా మహిళలకు అంటూ వారు వాపోతున్నారు. గుర్తింపు కోసం న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు గుర్తింపులో వివక్ష ఎదురైతే తిరిగి న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఇందులో వారు విజయం సాధించాలని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.
Must Read ;- అమరావతి దాష్టీకం.. పోలీసు అరాచకత్వానికి పరాకాష్ట..