వల్లభనేని వంశీకి యార్లగడ్డ తొలి దెబ్బ అదుర్స్..!!
వల్లభనేని వంశీ.. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ టీమ్‌లో చేరిపోయాడు.. ఆయన సోదర సమానుడు, మాజీ మంత్రి కొడాలి నాని ప్రభావమో లేక సొంత లెక్కలో తెలియదు కానీ, వల్లభనేని వంశీ సైకిల్ దిగి ఫ్యాన్ చెంత చేరిపోయాడు.. అంతటితో ఆగలేదు, ఏకంగా రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఆయన అవాకులు, చెవాకులు పేలాడు. ఏకంగా ఆయన భార్య భువనేశ్వరిపై నిందలు వేశాడు వల్లభనేని వంశీ.. ఇవి రిటార్ట్ ఇవ్వడంతో సారీ చెప్పాడు తప్పక..
టీడీపీని వీడి, జగన్ టీమ్, ముఖ్యంగా సజ్జల చెప్పిన పలుకులు పలుకుతున్న వల్లభనేని వంశీ కోసం.. ఎన్నాళ్లనుండో వైసీపీని నమ్ముకున్న యార్లగడ్డ వెంకట్రావుకి హ్యాండ్ ఇచ్చారు.. ఆయనకు పొమ్మనకుండానే పొగబెట్టారు. తనను పార్టీ నుండి బహిష్కరించినంత పని చేశారని వాపోయారు యార్లగడ్డ. రెండేళ్ల నుండి తనకు జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కన్నీరుపెట్టుకున్నంత పనిచేశారు.
సరిగ్గా ఇలాంటి సమయంలో నున్న పంచాయతీకి ఉప ఎన్నికలు జరిగాయి.. ఇక్కడే తన సత్తా చాటాలనుకున్నారు యార్లగడ్డ.. ఇటు, తానేంటో తన పవర్ ఏంటో చూపించాలని భావించారు వల్లభనేని వంశీ.. గతంలో వైసీపీకి భారీ పట్టున్న ఈ పంచాయతీలో మరోసారి వైసీపీ జెండా ఎగరేసి అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలని స్కెచ్ వేసుకున్నాడు వల్లభనేని.. అయితే, తనకు పట్టున్న ప్రాంతంలో వల్లభనేనికి షాక్ ఇచ్చాడు యార్లగడ్డ.. అంతేకాదు, అక్కడి స్థానిక టీడీపీ ఓటర్లలోనూ వల్లభనేని తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం అయిందని సమాచారం. ఈ పరిణామాలతో నున్న పంచాయతీని టీడీపీ దక్కించుకుంది.. సరిగ్గా ఇదే టైమ్‌లో యార్లగడ్డ టీడీపీ కండువా కప్పుకున్నారు..
గన్నవరంలో తాము చేసిన తప్పు తెలిసివచ్చిందని, యార్లగడ్డను సముదాయించి ఉంటే సరిపోయేదని భావనలో ఉందట తాడేపల్లి ప్యాలెస్ టీమ్. వల్లభనేనిని నమ్ముకొని యార్లగడ్డను పార్టీ నుండి తరిమేశామని, తాజాగా వెలువడిన నున్న ఫలితంతో గన్నవరంను టీడీపీ అకౌంట్లో చేతులారా వేశామని పునరాలోచనలో పడిందట వైసీపీ హైకమాండ్.. అందుకే, వల్లభనేని వంశీకి సీరియస్‌గా క్లాస్ పీకారని, ఎన్నికల నాటికి ఫలితం మారిపోవాలని వార్నింగ్ ఇచ్చారని సమాచారం.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, వల్లభనేని వంశీకి భారీ షాక్ తగిలింది.. ఇటు, నున్న విజయంతో యార్లగడ్డ టీడీపీ కేడర్‌లో జోష్ పెంచాడు.. ఇలా ఆదిలోనే తొలి పంచ్ ఇచ్చాడు యార్లగడ్డ.. ఇదే ఊపు కొనసాగిస్తే వల్లభనేనికి షాక్ తగలడం ఖాయమనే సంకేతాలు పంపాడు యార్లగడ్డ.