ఇంతకాలం అపరిమితమైన అధికారంతో విర్రవీగిన వైసీపీకి కడప నగరపాలక ఎన్నికలు కోలుకోలేని దెబ్బ తీశాయి. కార్పొరేషన్‌గా అవతరించిన నాటి నుంచి కడపపై పెత్తనం చెలాయించిన వైసీపీ నేతలకు ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. నామినేషన్ల ఘట్టంలోనే కూటమి పార్టీలు మొత్తం 66 డివిజన్లకు గాను ఏకంగా 52 స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంతో కడపలో వైసీపీ అధ్యాయం ముగిసిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దౌర్జన్యాలు జరిగాయని పైకి బీరాలు పలుకుతున్నా, కనీసం పోటీ ఇచ్చే సత్తా కూడా లేక కాడి పడేయడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు.
కడప నగరంలో వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే..52 డివిజన్లలో అసలు పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. కేవలం 13 డివిజన్లలో మాత్రమే ఆ పార్టీ పోటీలో నిలిచింది. అందులోనూ పార్టీకి పట్టుందని చెప్పుకునే చిన్నచౌకు పరిధిలోని 6, 11, 13, 15, 16, 17 డివిజన్లలో కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు నేతలు చొరవ చూపడం లేదు. కమలాపురం పరిధిలోని 24వ డివిజన్లో పోరు ఏకపక్షం కాగా, 33వ డివిజన్లో కోర్టు ఆదేశాలతో నామినేషన్ వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగిలిన 45, 46, 51, 52, 55 డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో నిస్సహాయులుగా మిగిలిపోయారు.
పోటీలో ఉన్న కొద్దిపాటి స్థానాల్లో కూడా ఎన్నికల నిర్వహణ చూసే దిక్కు లేకుండా పోయింది. సిటీ పరిధిలోని 361 పోలింగ్ కేంద్రాల్లో బూత్ మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక్కో కేంద్రానికి నలుగురు ఏజెంట్లను నియమించుకునే వెసులుబాటు ఉన్నా, ఆ బాధ్యత మోసేందుకు వైసీపీ నేతలు సుముఖంగా లేరు. దీంతో ఆ పార్టీ తరఫున మేయర్ ఎన్నికల బాధ్యతను అసలు ఎవరు చూస్తున్నారో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.
అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి, ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక చేతులెత్తేసిన వైసీపీ నేతల తీరుపై సొంత శ్రేణులే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్టీ మరీ ఇంత బలహీనపడిపోతుందా అని కార్యకర్తలు డీలా పడ్డారు. బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం, పోటీలో అభ్యర్థులు నిలబడలేకపోవడంతో మేయర్ పీఠం ఆశలు కూడా ఆవిరైపోయాయి. ఒకప్పుడు తమకు తిరుగులేదని భావించిన కడప కార్పొరేషన్లో వైసీపీ దుకాణం సర్దేసిందని, ఆ పార్టీ ఉనికి కడపలో దాదాపు ఖతమైపోయిందని ప్రస్తుత ఎన్నికల పరిణామాలు చెబుతున్నాయి.











