ఏపీ రాజకీయాలను తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందన్న వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. ఈ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కగా…కోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారంపై సీబీఐ దైరెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ వ్యవహారానికి కీలక సూత్రధారిగా భావిస్తున్న తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ)కి మొన్నటిదాకా కార్యనిర్వహణాధికారి (ఈవో)గా వ్యవహరించిన ఏవీ ధర్మారెడ్డి…బీజేపీ కీలక నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరితో భేటీ అయ్యారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ పాలనలో ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా వ్యవహరించారు. అంతేకాకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా ఆయన తండ్రి దివంగత రాజశేఖరరెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడిగా మెలగిన ధర్మారెడ్డి… తన చుట్టూ విమర్శల జడివాన కమ్మేసిన వేళ.. వైఎస్ ఫ్యామిలీతో రాజకీయ వైరం కలిగిన సుజనాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామానికి చెందిన ధర్మారెడ్డి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో ఒకటైన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ (ఐడీఈఎస్)కు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో భాగంగా ఢిల్లీలో అడుగుపెట్టిన ధర్మారెడ్డి…క్రమంగా రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఫలితంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా…నాటి కాంగ్రెస్ సర్కారు ధర్మారెడ్డిని ఏపీకి రప్పించి ఏరికోరి మరీ టీటీడీ జేఈఓగా పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిన ధర్మారెడ్డిని… జగన్ కూడా తాను సీఎం కాగానే ఏపీకి రప్పించారు.
టీటీడీ జేఈవోగా బాధ్యతలు అప్పజెప్పిన జగన్.. ఆ తర్వాత ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కనపెట్టి మరీ ఆయనకు ఏకంగా టీటీడీ ఈవోగా పదవిని కట్టబెట్టారు..ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే.. టీటీడీ ఈవో పోస్టు నుంచి తప్పించగా…ధర్మారెడ్డి దాదాపుగా అదృశ్యమయ్యారనే చెప్పాలి. టీటీడీ ఈవో హోదాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ధర్మారెడ్డి… అటు విపక్షాలతో పాటుగా ఇటు అధికార వైసీపీ నేతల నుంచి కూడా విమర్శలను ఎదుర్కొన్నారు.
లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న అంశంపై ఓ వైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా… ధర్మారెడ్డి ఏమాత్రం స్పందించిన దాఖలా లేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయంపైనా స్పష్టమైన సమాచారం లేదు.రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఆయన భువనగిరి పరిధిలో నూతనంగా వెలసిన ఓ ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైనట్లుగా సమాచారం. ఆ కార్యక్రమానికి ముందుగానో, లేదంటే తర్వాతో సుజనాతో ధర్మారెడ్డి సమావేశమై ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నిజమేనని తేలితే… ఆ ముప్పు నుంచి తాను తప్పించుకోవడమెలా? అన్న దిశగా తర్జనభర్జన పడుతున్న ధర్మారెడ్డి… ఈ వివాదం నుంచి తనను బయటపడేయాలని కోరేందుకు ఆయన సుజనా చౌదరితో భేటీ అయినట్లుగా సమాచారం.
సుజనాతో దర్మారెడ్డి భేటీ ఎపిసోడ్… వైసీపీలో ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్‌ని కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.. ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారినా, లేక టీటీడీలో జగన్ హయాంలో జరిగిన అవతకతవకలపై సమాచారం ఇచ్చినా, అది వైసీపీకి క్లియర్ డ్యామేజ్.. అందుకే, సుజనాతో ధర్మారెడ్డి భేటీ వెనక సీక్రెట్ ఏంటనేది తెలుసుకోవడానికి జగన్ తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. తిరుమల లడ్డూ అంశంపై ఇప్పటికే సుప్రీం కోర్టు సీబీఐ, ఏపీ సీఐడీ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించింది.. త్వరలోనే ఆ కమిటీ ఎంక్వయిరీ చేయనుంది.. తాజాగా ధర్మారెడ్డి … సుజనా చౌదరితో భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.. మరి, ఈ పరిణామం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి..