ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి… వైసీపీ అధికారంలో ఉండగా పేట్రేగిపోయారనే చెప్పాలి. డైరెక్టుగా నాటి సీఎం జగన్ తోనే సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకున్న ఈ నేత వ్యవహార సరళి కారణంగా వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్న వాదనలు ఉన్నాయి. రాజకీయ నేతల అండ చూసుకుని ఉద్యోగ నియమాళిని కూడా పక్కనపెట్టేసిన వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. అయినా బుద్ధి రాని ఆయన తన దురుసు వర్తనతో ఈ దఫా ఏకంగా అరెస్ట్ అయ్యారు. ఏపీ సచివాలయంలోని క్యాంటీన్ కార్యవర్గ ఎన్నికల్లో తన ప్యానెల్ కు చెందిన వారినే గెలిపించుకునేందుకు వ్యూహం రచించిన ఈ రెడ్డి గారు… ఉద్యోగులకు ఏకంగా మందు, విందులతో కూడా పార్టీని ఆఫర్ చేశారు. సస్పెన్షన్ వేటుతోె సచివాలయంలోకి అడుగుపెట్టేందుకే ఆస్కారం లేకపోవడంతో బయట ఓ రిసార్ట్ లో మందు పార్టీ పెట్టిన వెంకట్రామిరెడ్డి రెడ్డిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
2019 ఎన్నికల్లో వైైసీపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం, ఆ వెంటనే జగన్ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు అందలం దక్కడం చూసిన వెంకట్రామిరెడ్డి తానూ ఎదిగేందుకు అవకాశం ఉందని భావించారేమో తెలియదు గానీ… వైసీపీకి దగ్గరైపోయారు. సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అధికారంలో ఉన్న వైసీపీ అండతో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన వెంకట్రామిరెడ్డి…ఆ తర్వాత ఉద్యోగ సంఘం నేత అన్న విషయాన్నే మరిచిపోయినట్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే వైసీపీ జమానాలో ఉద్యోగులకు ఏ ఒక్క అంశంలోనూ న్యాయం జరగలేదని చెప్పాలి. అసలు ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్నే వెంకట్రామిరెడ్డి అడ్డుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆయా సమస్యలపై ప్రభుత్వంతో ఉద్యోగులు ఎన్ని విడతలుగా చర్చలు జరిపినా కూడా వాటిపై సర్కారు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడానికి వెంకట్రామిరెడ్డే కారణమన్న వాదనలూ లేకపోలేదు. మొత్తంగా ఉద్యోగ సంఘం నేతగా వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల్లో విశ్వసనీయతను కోల్పోయారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తన ఉద్యోగ నియమావళికి విరుద్ధంగా ముందుకు సాగిన వెబకట్రామిరెడ్డి ఏకంగా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు కాగా… వెంకట్రామిరెడ్డి ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన మాట వాస్తవమేనని తేల్చిన ఉన్నతాధికారులు…ఆయనపైై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కారణంగా ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి సచివాలయంలోకి కూడా అడుగుపెట్టలేని స్థితికి చేరారు. అంటే.. ఉద్యోగ సంఘం నేతగా సచివాలయాన్ని ఏలిన వెంకట్రామిరెడ్డి తన దురుసు వర్తనతో ఇప్పుడు సచివాలయంలోకి ఎంట్రీ అర్హతను కూడా కోల్పోయారన్న మాట. సచివాలయంలోకి వెంకట్రామిరెడ్డికి ఎంట్రీ లేని సమయంలోనే సచివాలయ ఉద్యోగులు కీలకంగా భావించే క్యాంటీన్ కార్యవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఉద్యోగుల్లో తన పట్టును నిలుపుకునేందుకు వెంకట్రామిరెడ్డి రంగంలోకి దిగారు.అయితే సచివాలయంలోకి తనకు ఎంట్రీ లేదు కదా. మరేం చేయాలి? తాను సచివాలయంలోకి వెళ్లలేకున్నా… సచివాలయ ఉద్యోగులనే బయటకు పిలిపించుకుంటే పోలా అన్న దిశగా వెంకట్రామిరెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు.
అసలే ఎన్నికలు. ఆపై పిలుస్తున్నది రాజకీయవేత్తగా ఫీలైన రెడ్డి గారు. మరి… ఉద్యోగులంతా ఊరకనే ఎలా వస్తారు? అందుకే మందు, విందులతో కూడిన పార్టీ ఏర్పాటు చేయాలని వెంకట్రామిరెడ్ది నిర్ణయించారు. ఈ మందు, విందు పార్టీకి తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్ వేదికగా ఎంపిక చేశారు. ఎంతైనా రెడ్డిగారిగా డాబూదర్పం ఒలకబోశారు కదా… అందుకే కాబోలు జగన్ నివాసం ఉన్న తాడేపల్లినే వెంకట్రామిరెడ్డి మందు పార్టీకి వేదికగా ఎంచుకున్నారు. అనుమతి లేకుండా సాగుతున్న ఈ మందు, విందు పార్టీపై అబ్కారీ శాఖ అదికారులకు సమాచారం చేరిపోయింది. ఇంకేముంది… సరిగ్గా వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగ మిత్రులతో కలిసి మందు పార్టీలో ఫుల్లుగా లీనమైన వేళ ఎక్సజ్ శాఖ పోలీసులు సడెన్ గా షాకిచ్చారు. పార్టీపై దాడి చేసిన పోలీసులు అనుమతి లేకుండా మందు, విందు పార్టీ జరుగుతున్న మాట వాస్తవమేనని గ్రహించి దాని నిర్వాహకుడి హోదాలో వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఫలితంగా సచివాలయంలో ఉండాల్సిన వెంకట్రామిరెడ్డి.. తొలుత సెక్రటేరియట్ లోకి ఎంట్రీని రద్దు చేయించుకుని ఇప్పుడు ఏకంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరారన్న మాట.