ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరిని బదిలీ చేయించేందుకు ఢిల్లీ స్థాయిలో వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇవ్వడంతో, వైసీపీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. కోర్టు తీర్పులను కూడా తప్పుపడుతూ సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాశారు. అంతటితో ఆగకుండా ఆ లేఖ వివరాలను మీడియా సమావేశం పెట్టి మరీ వివరించారు. ఆ తరవాత కొందరు వైసీపీ నాయకులు న్యాయవ్యవస్థ పనితీరుపై విమర్శలు గుప్పించారు. దీనిపై సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలైంది. న్యాయవ్యవస్థపై ఏపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసిన అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది.
సీపీఐ జాతీయ కార్యదర్శి సంచలన ఆరోపణలు
ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ మహేశ్వరిని బదిలీ చేయించాలని వైసీపీ పెద్దలు ఢిల్లీ స్థాయిలో భారీగా లాబీయింగ్ చేస్తున్నారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన ఆరోపణలను కొట్టిపారేయలేం. హైకోర్టు తీర్పులపై ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. అయితే, న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధ వ్యవస్థ కావడంతో ఏమీ చేయలేక, సీజే జస్టిస్ మహేశ్వరిని బదిలీ చేయిస్తే కొంత వరకు ఉపశమనం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజధాని అమరావతి కేసుతో సహా అనేక కీలక కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే, వైసీపీ పెద్దల ఆశయానికి గండి పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాజధాని తరలింపు కోర్టు కేసుల మూలంగా నిలిచి పోయింది. అతిథి గృహం పేరుతో విశాఖలో పరిపాలనా భవనం నిర్మించాలనే ప్రయత్నాలను కూడా హైకోర్టు అడ్డుకుంటోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి వాపోయారని తెలుస్తోంది. హైకోర్టు తీర్పుల కారణంగా ఏపీ ప్రభుత్వం ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించలేకపోతోందని కూడా ఢిల్లీలో ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
Must Read ;- అసెంబ్లీలో చెలరేగుతుండగా.. జగన్పై సుప్రీం ఏమంటుందో?
హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ సాధ్యమవుతుందా?
న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల బదిలీల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. నియామకాలు, బదిలీలు కొలిజియం చూసుకుంటోంది. ఇందులో తలదూర్చే వ్యవహారం కేంద్ర పెద్దలు చేయకపోవచ్చని తెలుస్తోంది. అయినా ఓ ప్రయత్నం చేసి చూద్దామనే ఉద్దేశంతో ఏపీ హైకోర్టు సీజే బదిలీ కోసం వైసీపీ అధినేత గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను పరిశీలించకుండానే ఉభయ సభల్లో వైసీపీ సభ్యులు మద్దతు పలికారని తెలుస్తోంది. లోక్సభలో వైసీపీ సభ్యుల అవసరం బీజేపీకి లేదు. కానీ రాజ్యసభలో ఇప్పటికీ బీజేపీకి సరైన మెజారిటీ లేదు. దీంతో వైసీపీ సభ్యుల మద్దతు బీజేపీ కోరుతోంది. అందుకే వైసీసీతో సఖ్యత కొనసాగిస్తున్నారని సమాచారం.
సీజే బదిలీ జరిగితే కేంద్రానికే చెడ్డ పేరు
ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ మహేశ్వరిని బదిలే చేస్తే ఆ అపకీర్తి కేంద్ర బీజేపీ పెద్దల ఖాతాలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ నేతలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలకు కేంద్రం తుంగలో తొక్కింది. దీంతో ఏపీ ప్రజలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఏపీ హైకోర్టు సీజేని బదిలే చేస్తే, అమరావతి రైతులు వారి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఏపీ హైకోర్టు సీజే బదిలీ జరగకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read ;- వారిపైనే ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రయోగమా.. పోలీసు శాఖపై ఏపీ హైకోర్టు ఆగ్రహం