ఏపీలో అధికార వైసీపీ నేతల దాష్టీకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ అవి ఇంకా పెరుగుతున్నాయి. తమ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. సాధారణంగా రాజకీయంగా ఉన్న ప్రత్యర్థులపై వారు దాడులకు తెగబడేవారు.. ఇప్పుడు ఏకంగా గుళ్లోని పూజారులనుసైతం వదలకుండా.. వారిపై కూడా దాడులకు తెగబడుతున్నారు. నిన్న కాకినాడ నగరంలోని ఒక శివాలయంలో భక్తుల ఎదురుగానే పురోహితులపై వైసీపీ నాయకుడు భౌతికదాడికి దిగి భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు.
అభిషేకం సరిగా చేయలేదని గుడిలోనే అర్చకులను కాలితో తన్ని, దవడపై కొట్టాడు వైసీపీ నేత. సోమవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజాసామగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడ మరో అర్చకుడు పి.వెంకటసత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకూ ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడై ఆయన చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి, కాలితో తన్నడంతో ఆయన కింద పడ్డారు. వైసీపీ నాయకుడి కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయ్‌కుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. ఆయనను అసభ్యపదజాలంతో దూషించడమే కాక మీ అంతుచూస్తానంటూ వీరంగం సృష్టించారు.
ఈ ఘటనను జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా దేవాదాయ అధికారి పులి నారాయణమూర్తి, తనిఖీదారు ఫణీంద్రకుమార్తో పాటు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. పులి నారాయణమూర్తిని అది తనకు సంబంధించిన విషయం కాదని, డిప్యూటీ కమిషనర్‌ను వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళనకు దిగారు. అర్చకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫణీంద్రకుమార్ ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారుల సూచనలతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు (అర్చకుల)పై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే నేరాలపై సెక్షన్ 332 కింద సీఐ సురేశ్‌బాబు కేసు నమోదు చేశారు. అర్చకులపై దాడి ఘటనలో పోలీసుల వరకు వెళ్లొద్దని వైసీపీ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తర్జనభర్జన పడ్డారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లో ఉన్న దాడి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా బయటకు రానీయకుండా చేయాలని అధికార వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని.. న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బ్రాహ్మణ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.











