అధికారం పోయినా వైసీపీ నేతలకు అహంకారం దిగలేదు. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత గొట్లూరు సుధాకర్ రెడ్డి దళిత సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా..సుధాకర్ రెడ్డి దళితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపొల్లమా.. మాల, మాదిగ ల*కొడుకులమా అంటూ సుధాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సుధాకర్ రెడ్డి ఇంటిపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు దా*డికి దిగారు. క్షమాపణ డిమాండ్ చేశారు.
ఈ ఒక్క సంఘటనే కాదు.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ దళితుల పట్ల ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన వైఖరిని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. నాడు డాక్టర్ సుధాకర్ ఉదంతంలో ఆయనను మానసిక వేధింపులకు గురిచేసి ప్రాణాలు తీసే వరకు వేధించిన తీరు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హ*త్య చేసి మృ*తదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనలను ఏపీ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. నరసరావుపేటలో, చీరాలలో దళితులపై జరిగిన అరాచకాలు, శిరోముండనం ఉదంతాలు ఇంకా కళ్లముందే ఉన్నాయి.
నాడు అధికార మదంతో ఏ స్థాయిలో దళిత సమాజాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారో.. అధికారం కోల్పోయినా సరే వైసీపీ నేతల బూతు మనస్తత్వం, దళితుల పట్ల కక్షపూరిత ఆలోచనా ధోరణి మారలేదనడానికి సుధాకర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలే ప్రత్యక్ష నిదర్శనం. రాజకీయ ప్రత్యర్థులపై ఉద్రేకంతో మాట్లాడే క్రమంలో ఏకంగా మాల, మాదిగ కులాలను ఉద్దేశించి దారుణమైన పదజాలం వాడటం కుల అహంకారాన్ని, దళిత సమాజం పట్ల ఉన్న చులకన భావాన్ని ఎత్తిచూపుతోంది.
సుధాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠినమైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో సదరు నేత క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, దళిత సమాజం మాత్రం ఈ నాటకాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఓటు బ్యాంకు కోసం వేదికలపై దళిత ప్రేమ ఒలకబోస్తూ, క్షేత్రస్థాయిలో మాత్రం నిరంతరం వారిని కించపరిచేలా వ్యవహరించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందనడానికి ఈ ఘటనే సాక్ష్యమని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.











