ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్‌లు, 106 మున్సిపాలిటీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాజధాని ప్రాంతంలో భాగంగా ఉన్న మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని గిరిజన సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో.. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధిక ఎస్టీ జనాభా ఉండటంతో.. 2021 ఎన్నికల్లో అక్కడి మేయర్ సీటు ఎస్టీ అభ్యర్ధులకు రిజర్వ్ అయింది. ఈసారి రొటేషన్ పద్దతిలో నెల్లూరు తర్వాత అత్యధిక ఎస్టీ జనాభా ఉన్న మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి రిజర్వ్ చేశారు. రెండు లక్షల 53 వేల మంది ఓటర్లు ఉన్న మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8,577 మంది ఎస్టీలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 3.38 శాతం.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం ఛైర్ పర్సన్, మేయర్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేశారు. కార్పొరేషన్లలో ఎస్టీలకు ఒకటి.. ఎస్సీలకు రెండు, బీసీ మహిళలకు 2, బీసీ జనరల్ కేటగిరీకి 3, జనరల్ మహిళా విభాగంలో 5 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. విజయవాడ, ఒంగోలు, నెల్లురు, తిరుపతి కార్పొరేషన్లు అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు.
రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల ఛైర్ పర్సన్ పదవుల్లో 35 బీసీలకు, 14 ఎస్సీలకు, 3 ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. జనరల్ కేటగిరిలో మహిళలకు 27 సీట్లు కేటాయించగా.. 26 స్థానాలు అన్‌రిజర్వ్‌గా ఉన్నాయి. మచిలీపట్నం, కాకినాడ కార్పొరేషన్లు బీసీ మహిళలకు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కడప కార్పొరేషన్లు జనరల్ కేటగిరీ మహిళలు కేటాయించారు.
2021 మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఇష్టారాజ్యంగా మార్చడంపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. ఈసారి అలాంటి వివాదాలకు అవకాశం లేకుండా.. కూటమి ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన, రొటేషన్ పద్ధతిలో చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు వారి ప్రాధాన్యతల ప్రకారం సీట్లను కేటాయించారు.











