ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ వికృత చేష్టలు శ్రుతిమించుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ నాయకులపై మాటల దాడులు, వారి ఆస్తులపై దాడులు చేసి బుల్డోజర్ రాజకీయాలు చేసిన జగన్ పార్టీ..ఆ చర్యల ద్వారా రాక్షసానందం పొందిందనే చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఆ పార్టీ శ్రేణుల వ్యవహార శైలి రోజు రోజుకి హద్దులు మీరుతున్నట్లుగానే కనిపిస్తోంది.మరో రెండు రోజుల్లో కృష్ణా జిల్లా గుడివాడలో టిడిపి విని మహానాడుకు సన్నాహాలు జరుగుతుండగా ఆ పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు.
గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు పూయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే మండలంలోని అంగలూరులో మినీ మహానాడు నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి.ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నారు. కాగా, విని మహానాడు సభా ప్రాంగణానికి కూతవేటు దూరంలోని బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు వైసీపీ రంగులు పూశారు.ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడం పై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడం ద్వారా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని టీడీపీ మండల అధ్యక్షుడు వాసే మురళీకృష్ణ అన్నారు.కొడాలి నాని ప్రోతబలంతోనే వైసీపీ నాయకులు ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఆ దిమ్మకు తిరిగి పసుపు రంగు వేశారు.వైసీపీ ఆరాచకాలకు స్వస్తి పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు. మహానాడు బ్యానర్లపై అధికార పార్టీ నాయకులు తమ బ్యానర్లు కట్టుకున్నారంటూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రూరల్ సీఐ జయకుమార్ అక్కడికి పోలీసు బలగాలను తరలించారు. పికెట్ ఏర్పాటు చేశారు.