ఏపీలో నాలుగునరేళ్ళ జగన్ రెడ్డి పాలనా విధానాలను ప్రజలే కాదు.. వైసీపీ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 13 జిల్లాలో ఫ్యాన్ రివర్స్ తిరుగుతోందని ఆ పార్టీ ఆస్థాన వ్యూహకర్త పీకే ఎప్పుడో చెప్పారు.. నేటికీ చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ.. వైసీపీ అధినేతలో మార్పు మచ్చుకైనా కనిపించడంలేదన్నది వాస్తవం.
ఈ మధ్య పార్టీ అధిష్టానం జిల్లాలువారీగా పార్టీ కీలక నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ స్ధితిగతులను గురించి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. ఆ మధ్య పల్నాడు జిల్లాలో కూడా అధిష్టానం స్థానిక వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి విడదల రజనీపై చిలకలూరిపేట ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఆమె చర్యలు పార్టీ తలనొప్పిగా మారిందని.. ఈ సారి ఆమెకు టికెట్ ఇస్తే పని చేసేదేలే అంటూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ముందే చెప్పేశారు.
ఈ క్రమంలో నెల్లూరు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలపై ముఖ్య నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాముల ద్వారకనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ యాదవ్ కూడా అనిల్ అవలంబిస్తున్న విధానాలపై ఖండించారు. పార్టీ విచ్ఛిన్నానికి కణం కట్టుకున్న మాదిరిగా ఇక్కడ వైసీపీ కేడర్, నేతలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు.
అయితే ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆనం, కోటంరెడ్డి, మేకపాటి లు బయటకు రాగా.. ప్రధాన నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పి.. తలో దారి చూసుకుంటున్నారు. నెల్లూరు పార్టీ కోఆర్డినేటర్ గా వ్వవహరిస్తున్న ఎంపీ విజయసాయి ఎంత నచ్చచెప్పినా.. ఇక్కడ కేడర్ వినే పరిస్ధితిలో లేదు. ఇప్పటికే సర్వేలన్నీ నెల్లూరు జిల్లాలో పార్టీ ఘోరంగా ఓడిపోబోతుందని ఒకపక్క చెప్తున్నా.. నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదన్నది వాస్తవం.
ఇది నెల్లూరులోనే కాదు.. ఏపీ వ్యాప్తంగా వైసీపీ పరిస్ధితి ఇలానే ఉంది. పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారా స్థాయికి చేరుతోంది. పార్టీని జగన్ రెడ్డి గాలికొదిలేసి.. అనర్హులలకు, అర్భకులకు.., అనాముకులకు పార్టీ పెత్తనం అప్పజెప్పితే మేం ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా వైసీపీ కేడర్ లో అసంతృప్తి వాదుల సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు కేడర్ లోనూ.., ఇటు ప్రజల్లో వైసీపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తి రాగం వణుకు తెప్పిస్తుందనే ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.