వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా… టీడీపీ అధినేత, ఏపీ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడిపై అవాకులు చెవాకులు పేలే వారు. స్వయంగా సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును హేళన చేసిన విషయం ఇప్పటికీ జనం చెవుల్లో గిర్రున తిరుగుతూనే ఉంది. ప్రతివారం పోలవరానికి వెళ్లిన చంద్రబాబుఅకుంఠిత దీక్షను అవహేళన చేసిన జగన్… పోలవరానికి వెళ్లిన చంద్రబాబు… జయము జయము చంద్రన్న అంటూ పాటలు పాడించుకోవడం మినహా చేసిందేమీ లేదని సెటైర్లు సంధించారు. తీరా ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి, టీడీపీ అధికారంలోకి మారిపోయాక… వైసీపీ మాదిరే ఆ పార్టీ స్వరం మారిపోయింది. నాడు హేళన చేసిన నోటితోనే ఇప్పుడు ఆ పార్టీ నేతలు జయహో చంద్రబాబు అంటూ వేనోళ్ల కొనియాడుతున్నారు. ఈ 6 నెలల్లోనే ఇంత మార్పు ఎలా సాధ్యమైందంన్న దానిపై ఆరా తీస్తే… అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలకు ఇదొక్కటే మార్గంగా దొరికిందన్న సమాధానం వినవస్తోంది.
అధికారంలో ఉండగా… జగన్ తో పాటు వైసీపీకి చెందిన అందరు నేతలూ చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన కీలక నేతలను కించపరిచేలా మాట్లాడేవారు. చంద్రబాబును అయితే అవసరం ఉన్నా… లేకపోయినా కూడా.. జగన్ వద్ద మార్కులు కొట్టేందుకు పని గట్టుకుని మరీ చంద్రబాబును విమర్శించేవారు. ఇలాంటి వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్కే రోజా… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంతా అవుతుంది. అయితే ఇప్పుడు అదికారంలోకి టీడీపీ వచ్చింది కదా..నాడు వైసీపీ అదికారంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారంతా అరెస్టుల భయంతో వణికిపోతున్నారు.
తానో శుద్దపూసను అని చెప్పుకునే పేర్నినాని అందుకేమీ మినహాయింపేమీ కాదు. సివిల్ సప్లైస్ కు తన గోదామును అద్దెకు ఇచ్చిన నాని… అందులో నుంచి పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున మాయం చేశారు. ఈ వ్యవహారంలో తన సతీమణిపై కేసు నమోదు కాగా… ఆమె అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఏకంగా ఆమెను ఆయన అండర్ గ్రౌండ్ కు పంపారు. తాజాగా సోమవారం ఆమెకు బెయిల్ వచ్చినా… ఆదివారం నాని నోట చంద్రబాబు భజన కీర్తనలు వినిపించాయి.
మచిలీపట్నానికి చెందిన టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర తన కుటుంబంపై వ్యక్తిగతంగా కక్ష కట్టారని ఆరోపించిన నాని… తన సతీమణిని కనీసం ఒక్క రోజైనా జైలులో పెట్టేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. అయితే నానితో పాటు నాని కుమారుడిని అరెస్ట్ చేసుకోండి గానీ… నాని భార్య జోలికి మాత్రం వెళ్లవద్దని చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. అంటే… మహిళల పట్ల చంద్రబాబుకు ఉన్న సానుకూల దృక్పథం చాలా గొప్పదంటూ ఆయన చంద్రబాబును ఆకాశానికెత్తేశారు.
చంద్రబాబు చాలా విషయాల్లో జెంటిల్ మన్ గా వ్యవహరిస్తారని చెప్పిన నాని… టీడీపీ నేతలే ఆయనను తప్పుదారి పట్టేలా వ్యవహరిస్తారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా… చంద్రబాబు మాత్రం తప్పు దారిలో వెళ్లరని కూడా మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా తనపై చంద్రబాబుకు ఉన్న కోపం కొంతమేరకైకా తగ్గుతుందన్న భావనతోనేనాని ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగైతేనేమీ…పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ దొరికింది కాబట్టి సరిపోయింది గానీ… లేదంటే చంద్రబాబును నాని ఇంకెతం మేర పొడిగి ఉండేవారోనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే…వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు స్వైర విహారం చేశారు. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారంతా నాని మాదిరే చంద్రబాబు భజన మొదలుపెట్టేశారట. నాని అంటే… కాస్తంత విషయం ఉన్న నేత కాబట్టి చంద్రబాబును బహిరంగంగానే పొగడగలిగారు. వైసీపీలో ఈ స్థాయి ఉన్న నేతలు చాలాతక్కువ కదా. అందుకే కాబోలు.. చంద్రబాబును ఎక్కడ బహిరంగంగా పొగిడితే… జగన్ కు తాము దూరమైపోవడం ఖాయమని భయపడిపోతున్నారు. అలాగని కేసులను మీదేసుకుని జైలుకు వెళ్లి కూర్చోలేరు కదా.
అందుకే చాటుగా ఇంటెలిజెన్స్ వర్గాల వద్దకెళ్లి చంద్రబాబు భజన కీర్తనల్లో మునిగి తేలుతూ ఆ విషయాన్ని చంద్రబాబుకు చేరేలా చూసుకుంటున్నారు. ఇందుకు వారు అనుసరిస్తున్న వ్యూహాలు, ఇబ్బందులను చూసి ఇంటెలిజెన్స్ అధికారులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారట. మొత్తంగా తమ పార్టీ అధికారంలో తాము చేసిన తప్పుల నుంచి తమను కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు నామస్మరణ చేస్తున్న వైనం ఆసక్తి రేకె్త్తిస్తోంది.