ఆమె 2సార్లు ఎమ్మెల్యే మాత్రమే కాదు ప్రస్తుతం మంత్రి..ఆమె నోటికి అదుపులేదు, ఆమె అహంకారానికి తిరుగులేదు… తన బూట్లు ప్రభుత్వ ఉద్యోగితో మోయించగలరు, స్టేజిపై రకరకాల డ్యాన్స్ లు వేస్తారు. ఆమే నగరి ఎమ్మెల్యే రోజారెడ్డి. బాపట్ల సూర్యలంక బీచ్ కెళ్లి మండే ఎండలో సముద్రతీరాన ఆమె చక్కర్లు చూసి జనం బిత్తరపోయారు. తన శాఖలో పనిచేసే చిరుద్యోగి ఆమె బూట్లను మోస్తూ రోజా(ప్రభు) భక్తి ప్రదర్శించడం మరో సంచలనం.. ఇక మరో మంత్రి విడదల రజని స్టయిలే వేరు.. సోషల్ మీడియాలో ఆమె ప్రచారానికి చేసే ఖర్చు కోట్లలోనే..ఇప్పుడు ఏకంగా సినీ నిర్మాతగా మారుతున్నారని, అందుకోసం హైదరాబాద్ లో ప్రొడక్షన్ ఆఫీసు కూడా పెట్టారనే వార్తలు గుప్పుమన్నాయి.
తనపై సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టాడని దళిత యువకుడిని స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా, సదరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అదంతా వీడియో తీసి ఆమెకు చూపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రూపురేఖలే మారిపోయాయి. ఓట్లేసిన ప్రజలను, నియోజకవర్గాన్ని గాలికొదిలేసి, కాలేజీ పిల్ల మాదిరి ఢిల్లీ వీథుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఈమేనా మా ఎమ్మెల్యే అని తాడికొండ ప్రజలే విస్తుపోయేలా వ్యక్తిగత పర్యటనల్లో మునిగి తేలుతున్నారు. ప్రజా జీవితాన్ని వదిలేసి వ్యక్తిగత జీవితమే సో బెటరంటూ ఉండవల్లి శ్రీదేవి ఎంజాయ్ మెంట్ హాట్ టాపిక్ గా మారింది.
ఇక వైసిపి ల్యాండ్ మాఫియాలో మగాళ్లేనా..మేము మాత్రం తక్కువా అంటూ వందల ఎకరాల భూముల కబ్జాలో మునిగితేలుతున్నారు మహిళా మంత్రి ఉషశ్రీ చరణ్..కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచేనా, చచ్చేనా అంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టడమేమో గాని, భూకబ్జాల్లో బిజీ అయ్యారు.
శ్రీసత్యసాయి జిల్లాలో సుజలాన్ పవర్ ప్లాంట్ భూములపై కన్నేశారు. కనగానపల్లి మండలం తూంపల్లి వద్ద 120ఎకరాలు ఆక్రమించారు. సర్వే నెం 99లో 6ఎకరాల గుట్ట ఆక్రమించేశారు. మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రిసార్ట్ లో బోటింగ్ కు చెరువు నిర్మాణానికి ప్రభుత్వ నిధులను అడ్డగోలుగా వాడేశారు. భూములకు కంచెలేసి, రైతులను బెదిరించి తక్కువ ధరకు గుంజుకున్నారు. ఆ భూముల్లో రిసార్టు కట్టే పనిలో పడ్డారు, వేల టిప్పర్ల మట్టి, ఇసుక తరలించడం, టిడిపి సహా ఇతర విపక్షాలు గగ్గోలు చేయడం తెలిసిందే. ఇక ఉద్యోగాలకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలను సొంతపార్టీ కార్యకర్తలే చేయడం గమనార్హం.
ఇక మరోమంత్రి తానేటి వనిత కూడా అసందర్భ వ్యాఖ్యలతో వివాదాస్పదం కావడం పరిపాటే.. తల్లులు సరిగ్గా లేకే పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న ఆమె వ్యాఖ్యలపై యావత్ మహిళాలోకం మండిపడింది. అప్పటికప్పుడు అనుకోని రీతిలో అలా జరుగుతుంటాయని రేప్ లపై ఆమె వ్యాఖ్యలు సృష్టించిన కాంట్రవర్సీ విదితమే.. రాబోయే ఎన్నికల్లో వైసిపి చిత్తుగా ఓడిపోతుందనే సర్వేల నేపథ్యంలో వీళ్లంతా ఆబగా అందినకాడికి దోచే పనిలో పడ్డారు. ఓట్లేసిన జనాన్ని, నియోజకవర్గాలను గాలికొదిలేశారు. అవినీతి కుంభకోణాల్లో, వినోదాల్లో మునిగిపోయారు.. జగన్ గ్రాఫ్ 11% పడిపోవడం, సీఎంల జాబితాలో 10వ స్థానానికి దిగజారడం దరిమిలా వైసిపిలో పుట్టిన ముసలం రాబోయే రోజుల్లో మరెలా ఉంటుందో..?