స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడేపల్లి ప్యాలెస్ వ్యూహాలు బెడిసికొట్టాయి. తమ అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకొంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా వాస్తవాలు పూర్తిగా రివర్స్‌లో ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాయలసీమ, పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సమస్యలు వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటిరోజే వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. పుంగనూరులో చేసిన అరాచకంతో గొడ్డలి పార్టీ అసలు నైజం బయటపడింది. మిథున్‌రెడ్డి కాన్వాయ్‌లోని కారుతో టీడీపీ కార్యకర్తలను గుద్దేసి తొక్కించడం.. తెలుగుదేశం శ్రేణులపై.. వైసీపీ గూండాలు కర్రలు, సుత్తులతో దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన వైసీపీ నాయకులు.. 19 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమకు అడ్డంకులు ఎదురయ్యాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మొత్తం 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు.. నగర పంచాయతీల్లో 19 చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయని వైసీపీ నాయకులే చెబుతున్నారు. అంటే మిగిలిన వందకు పైగా పట్టణాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని పార్టీల అభ్యర్ధులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు.
ఆ 19 ప్రాంతాల్లో సమస్యలకు వైసీపీ వైఖరే కారణమని చెప్పే సాక్ష్యాలు వీడియోల రూపంలో కళ్ల ముందే కనిపిస్తున్నాయి. రాయలసీమలో, పల్నాడు ప్రాంతంలో జగన్ సన్నిహితులుగా పేరు పొందిన నాయకుల ఇలాఖాల్లోనే హింసాత్మక ఘటనలు జరిగాయి. వైసీపీ నాయకులు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే వందల మందితో నామినేషన్ కేంద్రాలకు వెళ్లి తెలుగుదేశం శ్రేణులను రెచ్చిగొట్టి గొడవలకు దిగారు. టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేయడంతో.. నామినేషన్లు కూడా వేయకుండా వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్క్రూటినీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాలిటీల్లో కొన్ని వార్డుల వరకు నామినేషన్ల గడువు పొడిగించింది. అక్టోబర్ 28న జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1కి వాయిదా వేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఖాయమని వైసీపీ నాయకులకు తెలుసు. బరిలోకి దిగి పరువు పోగొట్టుకోవడం కంటే.. గొడవలు చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకొంటున్నారని తప్పించుకోవడమే తాడేపల్లి ప్యాలెస్ స్ట్రాటజీ అనే వాదన వినిపిస్తోంది. ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయం ప్రజలకు చేరుతోంది. ముందుగా గొడవలు చేసింది.. నామినేషన్లు వేయకుండా వెళ్లిపోయిందీ వైసీపీ వాళ్లే అని సాక్ష్యాలతో సహా అందరికీ తెలిసిపోయింది. వాళ్లే గొడవలు చేసి సుప్రీం కోర్టుకి వెళ్లడం.. న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎలక్షన్స్ పోస్ట్‌పోన్ అవడంతో.. ఖర్చు మరింత పెరుగుతుంది. సుప్రీం కోర్టు వరకు వెళ్లి అభ్యర్ధుల ఖర్చు పెంచారని ఆ పార్టీ నాయకులే తిట్టుకొనే పరిస్థితి కనిపిస్తోంది.











