యువ కథానాయకులకు గట్టిపోటీ ఇచ్చేవారిలో శర్వానంద్ కూడా కనిపిస్తాడు. నానీ తరువాత విభిన్నమైన కథలను ఎంపిక చేసుకునే యంగ్ హీరోల జాబితాలో ఆయన పేరే ముందుగా వినిపిస్తుంది. చకచకా సినిమాలు చేసేయాలి .. తన సినిమాలు వరుసగా థియేటర్లకు వచ్చేయాలనే ఆరాటాన్ని మొదటి నుంచి కూడా శర్వానంద్ కనబరచలేదు. తనకి నచ్చిన కథలు .. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. కథానాయికను ఆటపట్టించే ఆకతాయి పాత్రలను మాత్రమే కాదు, మనసును భారం చేసే బరువైన పాత్రలతోను మెప్పించగలనని ఆయన నిరూపించుకున్నాడు.
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన పాత్రలను పండించే విషయంలో శర్వానంద్ కి మంచి మార్కులు దక్కాయి. ఆయా పాత్రల్లో సహజమైన నటనను ఆవిష్కరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు. ఇటీవల కాలంలో కథల ఎంపిక విషయంలో ఆయన కొత్తదనానికి ప్రాధాన్యతను ఇచ్చినా, అవి ఆశించినస్థాయి ఫలితాలను అందించలేదు. ‘పడి పడి లేచె మనసు’ .. ‘రణరంగం’ .. ‘జాను’ సినిమాలు ఆయన అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. ‘రణరంగం’ .. ‘జాను’ వంటి కథలను ఆయన అసలు ఒప్పుకోకుండానే ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపించాయి.
జయాపజయాల విషయంలో ఎప్పుడూ కూల్ గా వుండే శర్వానంద్ ను ఈ మూడు పరాజయాలు ఆలోచనలో పడేశాయి. దాంతో కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వుంటూ, కొత్తదనంతో కూడిన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ ముందుకువెళ్లాలనే నిర్ణయానికి వచ్చాడు. అలా ప్రేక్షకులకు కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన తాజా చిత్రమే ‘శ్రీకారం’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ‘రైతు’ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు. పోస్టర్ బయటికి వచ్చిన రోజునే, లుక్ పరంగా శర్వానంద్ మంచి మార్కులు కొట్టేశాడు.
కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శర్వానంద్ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. మిక్కీజె. మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను వదిలారు. ‘వత్తానంటివో .. పోతానంటివో’ అంటూ జానపద బాణీలో సాగే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పెంచల్ దాస్ పాడిన ఈ పాటకి, కొరియోగ్రఫీ కూడా బాగా కుదిరింది. యూత్ కి ఊపునీ .. ఉత్సాహాన్ని ఇచ్చేలా వున్న ఈ బీట్ బాగా పాప్యులర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్రామీణ నేపథ్యంలో సాగే కథ .. ఆసక్తికరమైన కథనం .. పాత్రల్లోని వైవిధ్యం .. సహజత్వానికి దగ్గరగా మలచబడిన సన్నివేశాలు .. హృద్యమైన చిత్రీకరణ .. కుర్రకారు మనసు తలుపు తట్టే పాటలు ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని శర్వానంద్ భావిస్తున్నాడు. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి టాక్ వుంది. అటు అభిమానుల్లోను అంచనాలు వున్నాయి. అందువలన ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకాన్ని శర్వానంద్ వ్యక్తం చేస్తున్నాడు. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న శర్వానంద్ కి, ఈ సినిమా ఎంతవరకూ ఊరటనిస్తుందో చూడాలి.











