‘ఉప్పెన’ దర్శకుడు సానా బుచ్చిబాబుకు సానా తెలివితేటలు ఉన్నాయండోయ్. అందుకే మొదటి సినిమానే అంత పెద్ద హిట్టు చేసిండు. ఆయనకు ముందు చూపు మెండుగా ఉన్నట్టుంది.. ఓ పక్క సినిమా షూటింగ్ చేసేస్తూనే తనకు కావలసిన మేకింగ్ వీడియోలను చేసుకోవడం మామూలు విషయమా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న మాట. పైగా ఈ సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ విషయంలో ఆయనకు పూర్తిగా ఈ రైట్స్ ఇచ్చేసినట్టుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా విడుదలైన సినిమాల్లో కలెక్షన్ పరంగా ‘ఉప్పెన’ రెండో స్థానంలో ఉంది. మొదటిస్థానంలో వైష్ణవ్ తేజ్ చిన మామయ్య నటించిన ‘వకీల్ సాబ్’ ఉంటే రెండో స్థానం మాత్రం మేనల్లుడికి దక్కింది.
సినిమా విషయం అలా ఉంటే యట్యూబ్ లో కూడా మేకింగ్ వీడియోలు సాధించిన కుమ్ముడు మామూలుగా లేదు. ఉప్పెన థియేటర్లలో ఫిబ్రవరి 12న విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు ప్రశాంతంగా ఆ సినిమా విడుదలైన తర్వాత మార్చి 17న యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 14 మేకింగ్ వీడియోలను అందులో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు దాదాపు 15 మిలియన్ వ్యూస్ సాధించాయి. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఈ వీడియోలకు ఇలాంటి స్పందన వచ్చిందంటే మున్ముందు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇంట్లో ఉన్న జనానికి ఈ వీడియోలు మంచి కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. పైగా హీరోయిన్ కృతి శెట్టికి ఉన్న క్రేజ్ వేరు. ఈ వీడియోలు చూడాలన్న ఆసక్తి ఆమె వల్లే వస్తోంది. ఇదేదో బాగుందని అందరూ ఇదే బాటలో పయనించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇలాంటి మేకింగ్ వీడియోలు చాలా వచ్చినా ఓ దర్శకుడు ఈ స్థాయిలో మేకింగ్ వీడియోలను పోస్టు చేయడం మాత్రం ప్రథమమని చెప్పాలి. సినిమా షూటింగులు ఎలా చేస్తారో తెలియనివారికి ఈ వీడియోలు ఆసక్తి కలిగిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబుకు సానా తెలివి తేటలు ఉన్నాయని ఒప్పుకోవలసిందే కదా!
Must Read ;- 100 కోట్ల క్లబ్ లోకి మెగా మూవీ ‘ఉప్పెన’











