YSR ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. తాజాగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్‌లో అఫిడవిట్ వేసిన జగన్…సోదరి షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతుందన్నారు జగన్. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, ఆమెపై గౌరవం ఉందన్నారు. కానీ షర్మిల వెనకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని పేర్కొన్నారు జగన్. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్‌లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలు పునరుద్ధరించాలంటూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు పిటిషన్ వేసిన విషయం విదితమే. ఇందులో విజయమ్మ దాఖలు చేసిన కౌంటరుతోపాటు సరస్వతి పవర్, డైరెక్టర్ చాగరి జనార్దన్‌రెడ్డి వేసిన కౌంటర్లు, షర్మిల దాఖలు చేసిన పిటిషన్లకు సమాధానమిస్తూ అఫిడవిట్ సమర్పించారు జగన్.
షర్మిల అత్యాశ వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగిందన్నారు జగన్. మొత్తం వ్యవహారాన్ని షర్మిల ప్లాన్ ప్రకారం తల్లిని ముందుంచి నడిపించిందని ఆరోపించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో తల్లి, ఇతరులను అడ్డుపెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల తనకు నష్టం జరిగిందన్నారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా నేనూ, భారతీ అమ్మ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదన్నారు జగన్. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలోనూ భాగస్వామి కాలేదన్నారు. ఏ నష్టాలకూ షర్మిల హామీ ఇవ్వలేదన్నారు. కంపెనీలపై నమోదైన కేసులను షర్మిల ఎదుర్కోలేదన్నారు జగన్. అయినా తల్లిని బలిపశువును చేసి, మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కంపెనీ చట్టంలోని సెక్షన్-59 కింద రిజిస్టర్‌లో పేర్లను మార్చినపుడు..సరైన కారణముంటే జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్‌కు ఉంది. ప్రతివాదులు ఈ పిటిషన్‌కు తప్పుడు భాష్యం చెబుతూ దీనిపై ట్రైబ్యునల్ విచారించకుండా, కుటుంబ వివాదంగా మార్చుతున్నారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పక్కా ప్లాన్ ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ పేర్కొన్నారు. సోదరి షర్మిల ఒత్తిడితో గిఫ్ట్‌డీడ్‌లను అడ్డుపెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటున్నారన్నారు జగన్. గిఫ్ట్‌డీడ్ ప్రక్రియ పూర్తికాలేదని..వాటాల సర్టిఫికెట్లను మేమింకా అమ్మకు అందజేయలేదన్నారు. వాటాలు కూడా బదలాయించలేదన్నారు జగన్. అసంపూర్తి గిఫ్ట్‌డీడ్‌తో వాటాల బదలాయింపు పూర్తైనట్లు కాదన్నారు. చట్టప్రకారం బదలాయింపు జరిగితేనే, చెల్లుబాటు అవుతుందని జగన్ వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల అమలులో భాగంగా NCLTలో పిటిషన్ వేసినట్లు తెలిపారు. ప్రస్తుత కేసులో బోర్డు డైరెక్టర్లు అక్రమంగా వాటాల బదలాయింపును ఆమోదించారని, అయితే, బోర్డు సమావేశం సమాచారం తనకు తెలియదంటూ ఒక డైరెక్టర్ పేర్కొన్నారని ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చారు. సరస్వతి పవర్‌లోని వాటాలను కోర్టు కేసులన్నీ పూర్తయ్యేదాకా అమ్మ వద్ద ఉంచామని, షర్మిల వల్లే విజయమ్మ ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.
చెల్లితో ఉన్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం అవాస్తవమన్నారు జగన్. క్లాసిక్ రియాల్టీలోని వాటాల బదలాయింపుతో సరస్వతి పవర్‌లో 48.99% వాటా ఉందన్నది వాస్తవమేనని పేర్కొననారు. గిఫ్ట్‌డీడ్ ఇచ్చినంత మాత్రాన వాటాలు బదలాయించినట్లు కాదన్నారు, ఆ వాటాలపై పూర్తి హక్కులు దాతవేనన్నారు జగన్. చెల్లిపై ఉన్న ప్రేమ, వాత్సల్యంతో నా ఆస్తులను భవిష్యత్తులో ఆమెకు ఇవ్వాలనుకున్నానని చెప్పుకొచ్చారు. అందుకే ముందస్తు తేదీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ కేసులన్నీ తేలాకే అంటూ MOUలో స్పష్టంగా ఉందని, అయినా, అలాంటి ఒప్పందమేదీ లేదని అమ్మ చెప్పడం అబద్ధమన్నారు జగన్. షర్మిల మోసపూరిత చర్యల వల్ల ఆ ఒప్పందమూ ఆగిపోయిందని చెప్పారు. చివరకు దాన్ని రద్దు చేసుకున్నట్లు గతంలోనే చెప్పిన విషయాన్ని ట్రైబ్యునల్ పరిగణించాలని కోరారు.
వాటాల అక్రమ బదలాయింపునకు కారణం షర్మిలేనని జగన్ పేర్కొన్నారు. గతంలో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఆమె చేసిన మోసం, అక్రమ చర్యల కారణంగా ఇప్పుడు లేవన్నారు. పాత తేదీలతో, సృష్టించిన పత్రాలతో, తప్పుడు అఫిడవిట్లతో మోసగించారన్నారు జగన్. నా ఆస్తిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కంపెనీలో వాటాదారు, డైరెక్టర్, నిర్వహణలో ఆమె పాత్ర ఉందని మేం చెప్పలేదన్నారు. మా మధ్య MOUను షర్మిల ప్రస్తావించడం లేదని స్పష్టం చేశారు. ఇదే వివాదంపై షర్మిల తనకు లేఖలు రాసిన సంగతిని గుర్తించాలన్నారు జగన్. అమ్మ ద్వారా ప్రయోజనాలు ఆశిస్తున్న షర్మిల ఈ వివాదంతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు. మరోవైపు గిఫ్ట్‌డీడ్, వాటాలపై అమ్మకున్న హక్కులపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుతో షర్మిలకు సంబంధముంది. ఆమె పిటిషన్‌ను తొలగించాలని కోరడం సరికాదని వివరించారు జగన్.
సరస్వతి పవర్‌లో వాటాదారుల పేర్లు సవరించి, తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు వేసిన పిటిషన్‌పై NCLT విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. గురువారం ట్రైబ్యునల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పూరిలతో కూడిన ధర్మాసనం విచారించింది.