ఏపీలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లకు ఎంత ప్రాముఖ్యం ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఎన్నికల్లోనూ వీరి ఓట్ల కోసమే వివిధ రాజకీయ పార్టీలు తహతహలాడుతుంటాయి. గత ఎన్నికల్లో కూడా కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న ప్రతినియోజకవర్గంలో కూటమి విజయదుందుభి మోగించింది. ఆ సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కోసం కాపులు ఏకతాటిపైకి వచ్చారు. ఫలితంగా కాపు సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అన్ని చోట్ల వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.
అటు రాయలసీమలో కాపుల్లో ఓ వర్గమైన బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల కూడా ఏడు స్థానాలు మినహా.. మొత్తంగా కూటమి తుడిచి పెట్టేసుకుపోయింది. ఇంత నష్టం జరిగాక ఆ నష్టపోయిన పార్టీ వెంటనే అలెర్ట్ అవ్వాల్సి ఉంటుంది. గతంలో 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం మొత్తం టీడీపీని వదిలేసిన సంగతి తెలిసిందే. రెడ్లు బలంగా ఉన్న నియోజకవర్గాలు, జిల్లాల్లో టీడీపీ ఓడిపోవడంతో గత ఎన్నికల నాటికి టీడీపీ నష్టనివారణ చర్యలు చేపట్టి.. రెడ్డి నేతలను రంగంలోకి దింపింది. అలా రెడ్లకు టీడీపీ చేరువ అయింది. కానీ, ఈ తరహా వ్యూహాలు వేయడంలో వైసీపీ విఫలం అవుతోంది.
తాజాగా కాపు సామాజిక వర్గం మరింతగా వైసీపీకి దూరం అవుతున్నట్లుగ కనిపిస్తోంది. ఏ సమస్య ఉన్నా తమ వారితోనే చర్చించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కాపులు తమ సమస్యలను రాజకీయాలకు అతీతంగా చర్చించేందుకు ముందుకు వస్తారు. అలాంటిది ఇప్పుడు వైసీపీని పూర్తిగా దూరం పెట్టారని అంటున్నారు. ఈ విషయాన్ని జగన్ కొత్తగా నియమించుకున్న కొత్త సలహాదారుడు ఆళ్ల మోహన సాయిదత్ గుర్తించినట్లుగా చెబుతున్నారు. అలా కాపులు దూరం జరగడానికి కూడా జగన్ వైఖరే కారణంగా చెబుతున్నారు. కాపు నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నా కూడా.. ఆయన పిలిచి మాట్లాడకపోవడంతోపాటు, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు.
ఏలూరు మాజీ ఎంపీ ఆళ్ల నాని, గుంటూరు నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇలా పార్టీ కీలక నేతలు కొందరు రాజీనామాలు చేసి పోతున్నా కూడా జగన్ వారిని పట్టించుకోకపోవడం లేదని అంటున్నారు. తమకు కూడా జగన్‌తో అవసరం లేదన్నట్టుగానే కాపులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్ కాపుల విషయంలో తన మొండి వైఖరి వీడితే తప్ప.. ఆ సామాజికవర్గ ఓటర్లు ఆ వైపునకు చేరబోరని అంటున్నారు.











