అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్‌కు జ్ఞానోదయం అయింది. అధికారంలో ఉన్న టైంలో లక్షలాది మంది వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను నియమించుకుని వాళ్లే సర్వస్వమని భావించారు. వారి అండ చూసుకుని ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లి బొక్కబొర్లా పడ్డారు. తీరా ఎన్నికల సమయానికి తాను నమ్ముకున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు జగన్‌కు హ్యాండిచ్చారు. అధికారంలో ఉన్ననాడు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలను పట్టించుకున్న పాపానపోలేదు జగన్.
అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ..40 శాతం ఓట్లు సాధించారంటే అది పార్టీని నమ్ముకున్న కార్యకర్తల వల్లే. అంతటి కూటమి ప్రభంజనంలోనూ జగన్ ఈ ఓటు శాతం ఒక రకంగా ప్రత్యర్థులకు షాకే. ఓటమి తర్వాత జగన్‌పై పార్టీ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అధికారంలో ఉన్న నాడు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన చుట్టూ ఓ కోటరీ నిర్మించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటమి తర్వాత పార్టీని తిరిగి యాక్టివ్ చేయాలనే ఆలోచనకు వచ్చారు. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అసంతృప్తిలో ఉన్న కార్యకర్తల అభిమానాన్ని తిరిగి పొందెందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం అని గ్రహించిన జగన్..ప్రతి మీటింగ్‌లో వారి గురించే మాట్లాడుతున్నారు. జగన్ 2.0 కార్యకర్తల కోసమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019-24 మధ్య కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని ఆయనే తన నేరాన్ని అంగీకరించారు.
వరుసగా నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్న జగన్..కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. గడిచిన ఐదేళ్లలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉందని, అందుకే కార్యకర్తలను పట్టించుకోలేకపోయానన్నారు. జగన్ తన సహజ స్వభావానికి విరుద్ధంగా కాస్త తగ్గి మాట్లాడారు. రాబోయేది జగన్ 2.0 పాలన అని కేడర్‌లో ధీమా కల్పించారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ చెప్తున్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానంటూ ఆయన హామీ ఇచ్చారు. హామీలు అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కార్యకర్తలకు ఉపదేశం చేశారు.