అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఏమాత్రం విమర్శించకుండా, ప్రతి కీలక బిల్లులోనూ మోదీ ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తూ వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు పూర్తిగా ప్లేట్ ఫిరాయించారు. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉంటూ వచ్చిన ఆయన,ఇటీవల మెల్లిగా తన వైఖరి మార్చుకుంటున్నారు. తాజాగా CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అరెస్టులపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. వారి అరెస్టును తప్పు పట్టారు. ఇదే కాదు..అవసరమైతే కాక్రోచ్‌ను అవుతానంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 2024 ఎన్నికల్లో NDA కూటమి ఏపీలో భారీ విజయం సాధించినా, మొన్నటి వరకు కేంద్రానికి అనుకూలంగానే మాట్లాడిన జగన్ వైఖరిలో ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు మార్పు వచ్చింది? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.
ఈ పరిణామాలు గమనిస్తుంటే, రాజకీయంగా పూర్తి చంద్రముఖిలా మారిపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబుపై రాజకీయంగా విమర్శలు గుప్పించేందుకు ఒక రూట్ అనుసరించిన జగన్, ఇప్పుడు తన సొంత మనుగడ కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కేంద్రంపై ఎదురుదాడికి దిగుతున్నారనే వాదనలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ కేంద్రానికి దాసోహం అన్న ఆయన, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత హఠాత్తుగా కేంద్ర విధానాలు తప్పు పట్టడం కేవలం రాజకీయ డ్రామానే అంటున్నారు విశ్లేషకులు.
సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అరెస్టుల అంశం ద్వారా ఏపీలో ఏదో ఒక రకంగా సానుభూతి పొంది, ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోవాలన్నది జగన్ డ్రామాగా తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించినా, ఆయన పాత ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదనడానికి ఈ ట్వీట్లే నిదర్శనం. అప్పట్లో కేంద్రంతో సఖ్యతగా ఉండి అన్ని పనులు చేయించుకున్న జగన్, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి ప్లేటు మార్చడం ఆయన అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట.
మొత్తానికి, జగన్ చేస్తున్న ఈ తాజా విన్యాసాలు ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమే తప్ప వేరు కాదు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, ప్రతిపక్షంలోకి రాగానే కేంద్రంపై తిరుగుబాటు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న జగన్ తీరు చూస్తుంటే, ఆయన రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజాక్షేమం ఎన్నడూ పట్టలేదనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఇలాంటి డ్రామాలను ఏపీ ప్రజలు ఇప్పటికే గమనించారు కాబట్టి, ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు.











