వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు వేసవి సెలవులు ఇచ్చారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే వానాకాలం వరకు కార్యక్రమాలు నిలిపివేయాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. వేసవి తీవ్రత కారణంగా పార్టీ కార్యక్రమాలకు సెలవులు ప్రకటించారని ఫ్యాన్ పార్టీ నేతలు చెప్తున్నారు.
జగన్ దంపతులు గత కొంత కాలంగా ప్రతి గురువారం బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు వెళ్తున్నారు. తిరిగి సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటున్నారు. అంటే వారానికి రెండు రోజులు మాత్రమే ఇక్కడ బస చేస్తున్నారన్న మాట. ఈ రెండు రోజుల్లోనూ పార్టీ తరపున ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు జగన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన రైతు పోరు, విద్యుత్ చార్జీల పోరు, ఫీజు పోరు ఆందోళనల బాధ్యతలను పార్టీలో మిగిలి ఉన్న సీనియర్ నేతలపైనే వేసేశారు. తానెక్కడా పాల్గొనలేదు.
జగన్ సీఎంగా ఉన్న టైంలో కోటరీగా ఉన్న కీలకమైన నేతలు కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం లేదు. పైగా వాటికి ప్రజల నుంచి పెద్దగా స్పందన కూడా రాలేదు. అయినా భారీ స్థాయిలో ఉద్యమించినట్లుగా ఐప్యాక్ బృందం మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. యువత పోరులో పాల్గొనేందుకు విద్యార్థులను పంపాలని కాలేజీల యాజమాన్యాలతో వైసీపీ స్థానిక నేతలు గొడవ పడిన ఘటనలు ఉన్నాయి. విద్యార్థులకు బదులు 45 ఏళ్లకు పైబడిన వారిని తీసుకొచ్చి ఆందోళనలు చేయడంతో ఈ కార్యక్రమం నవ్వులపాలైంది.
ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు జనం పెద్దగా రావడం లేదు. పార్టీ నేతలు సైతం జన సమీకరణ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చేయడం సరికాదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేసవి తీవ్రత తగ్గేంతవరకూ..అంటే వానాకాలం వచ్చే వరకు నిరసనలు, పార్టీ సమావేశాలు చేపట్టకూడదని జగన్ నిర్ణయించారని వైసీపీ నేతలు చెప్తున్నారు. నిజానికి సంక్రాంతి తర్వాత జిల్లాల టూర్లకు వస్తానని కార్యకర్తలకు, పార్టీ నేతలకు హామీ ఇచ్చారు జగన్. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహిస్తానని డిసెంబర్‌లో చెప్పారు. ఆ తర్వాత ప్రతి లోక్‌సభ స్థానంలో మూడేసి రోజులు బస చేసి..అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కీలక నిర్ణయాలు తీసుకుంటానన్నారు. కానీ సంక్రాంతి పోయి ఉగాది వస్తున్నా..ఆ ఊసే ఎత్తడం లేదు జగన్.