జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ రివర్స్ గేర్‌లోనే వెళ్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలు రివర్స్ చేయాలని ఈ పద్ధతి ప్రారంభించినా.. పోను పోనూ.. వాళ్ల సొంత విధానాలు, మాటల విషయంలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ వస్తున్నారు. మొదటి నుంచి తాడేపల్లి పెద్దలు చెప్పేదొకటి చేసేదొకటి. వారి మటలు.. వాళ్లు చేసే కార్యక్రమాలు కూడా అలాగే ఉంటాయి. మూడు రాజధానుల విషయంలో కూడా ఇదే రివర్స్ స్కీమ్‌తో ముందుకెళ్తున్నారు వైసీపీ వ్యూహకర్తలు.
విశాఖలో పాలన రాజధాని ఏర్పాటు చేయడంతో పాటు.. అమరావతిలో ఉన్న ప్రభుత్వ శాఖలన్నీ వైజాగ్ తరలిస్తామని ఊదరగోట్టేశారు అధికార పార్టీ నాయకులు. ప్రభుత్వ ఉద్యోగులంతా విశాఖ తరలి వెళ్తే, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్లో దూసుకుపోతుందని ఒక రేంజ్లో ప్రచారం చేశారు. నాలుగేళ్లు గడిచిన తర్వాత చూస్తే.. రుషికొండకు బోడిగుండు కొట్టేసి.. ముఖ్యమంత్రి కోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి రాజభవనం లాంటి ఇంటిని నిర్మించారు. ఉద్యోగుల కోసం ఆఫీసులు, నివాస భవనాలు వెతకడానికి ఇప్పుడు తీరిగ్గా ఒక కమిటీ వేసి మమ అనిపించారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెబుతున్న వైసీపీ పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నారు. కీలకమైన విద్యాశాఖకు సంబంధించి.. పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్, ఆదర్శ పాఠశాల సొసైటీ, వయోజన విద్య, ఏపీ రెసిడెన్షియల్ కార్యాలయంతో పాటు రాష్ట్ర గ్రంథాలయ శాఖ హెడ్ ఆఫీసు మొత్తం మంగళగిరి బైపాస్ రోడ్డు ఆనుకొని హ్యాపీ రిసార్ట్స్ పక్కనే ఉన్న వెంకటాద్రి టవర్స్ లో ఏర్పాటు చేశారు.
రాష్ట్ర గ్రంథాలయ శాఖ ప్రధాన కార్యాలయం ఇంతకుముందు మంగళగిరి శివాలయం ప్రక్కనే ఉండేది. విద్యాశాఖ కమిషనరేట్ ఇప్పటివరకు విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఉంది. కొత్తగా నిర్మించిన జీ ప్లస్ 5 బిల్డింగ్‌లోకి ఈ ఆఫీసులన్నీ షిఫ్ట్ అవుతున్నాయి. మొత్తం మీద విద్యాశాఖకు చెందిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక మంగళగిరిలోనే ఉన్నట్టే.
ఇవి కాక తాజాగా మరో నాలుగు ముఖ్యమైన ప్రభుత్వ శాఖల హెచ్ఓడి కార్యాలయాలు కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే నిర్మించిన భవనాలు అందుబాటులో ఉంటే.. వాటిలోకే ఆఫీసులు తరలి వస్తున్నాయి. లేకపోతే కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఏపీ పోలీసుల శాఖ ప్రధాన కార్యలయం కూడా మంగళగిరి సమీపంలోనే ఉంది. ఇప్పటికే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాలను లెక్కిస్తే నాలుగు పదులు దాటిపోతాయి.
మంగళగిరి కూడా అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగమనే విషయాన్ని గమనించాలి. పాత ప్లాన్ ప్రకారం కాకపోయినా, గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఈ కొత్త కార్యాలయాలన్నీ ఏర్పాటయ్యాయి. నాలుగున్నరేళ్ల నుంచి జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణమైన స్థితికి దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మంగళగిరిలో కొత్త ఆఫీసులు ఓపెన్ చేస్తూ.. విశాఖలో మళ్లీ కార్యాలయాలు నిర్మించడం, అసాధ్యమనే చెప్పుకోవచ్చు.
పాలన వికేంద్రీకరణ పాట అందుకున్న రోజు నుంచి విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, కోర్టు తీర్పుల తర్వాత వైజాగ్‌లో సీఎం క్యాంప్ ఆఫీసుతోనే సరిపెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కూడా కన్ఫర్మ్ చేశారు. అమతరావతి – మంగళగిరి ప్రాంతంలో విస్తరిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను గమనిస్తే.. సీఎం జగన్ విశాఖ రాజధాని అంశాన్ని ఆల్రెడీ అటకెక్కించేశారని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం ఉత్తరాంధ్రలో ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే ఇంకా విశాఖ నుంచి పాలన అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.