గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా కారు కింద నలిగిపోయి సింగయ్య అనే దళితుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-2గా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను చేర్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని కోరారు.
ఐతే జగన్ క్వాష్ పిటిషన్‌లో ఆసక్తికర వాదనలు చేశారు. సోషల్‌మీడియాలో వైసీపీ కార్యకర్తలు వినిపిస్తున్న వాదనలే తన క్వాష్ పిటిషన్‌లో వినిపించారు జగన్. తాను ప్రయాణిస్తున్న వాహనం బరువు ఇరువైపులా నిల్చున్న గార్డులతో కలిపి 4,000 కిలోల వరకు ఉంటుందన్నారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదన్నారు జగన్.
జగన్ కారు కింద సింగయ్య పడిని విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై జగన్ కూడా స్పందించారు. దురదృష్టవశాత్తూ జరిగిందన్నారు. అంబటి రాంబాబు సింగయ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం కూడా ఇచ్చారు. ఐతే ఇప్పుడు సంబంధం లేదని వాదించడానికి జగన్ విచిత్రమైన కారణాలను.. సోషల్ మీడియా కార్యకర్తలు మిడిమిడి జ్ఞానంతో చేసే వాదనలను హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
జగన్ పోలీసు సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారు.
ఆ వృద్ధుడు కారు కింద పడిన తర్వాత కారును ఆపి ఆ వృద్ధుడ్ని బయటకు తీసి..పక్కన డివైడర్ చెట్ల మధ్యన పడేశారు. అప్పటికి జగన్ రెడ్డి..కారు నుంచి బయటకు వచ్చి..అభివాదాలు చేస్తున్నారు. అంత చేస్తూంటే జగన్‌కు తెలియకుండా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.











