వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్ CPRO పూడి శ్రీహరిని AP పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీహరి సీపీఆర్‌వోగా కీలక బాధ్యతలు నిర్వహించారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా, పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని సోషల్‌మీడియాలో అభ్యంతరకర
పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లుగా యానిమేషన్‌తో కూడిన పోస్టింగ్‌లను వైరల్ చేయడంలో శ్రీహరి పాత్ర ఉన్నట్లు చిత్తూరులో కేసు నమోదైంది. ఈ పోస్టులు ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ప్రారంభించారు.
అరెస్ట్ సమయంలో శ్రీహరి నుంచి పోలీసులు సెల్‌ఫోన్ మరియు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదరు యానిమేషన్ వీడియోలు ఎక్కడ రూపొందించారు..? వీటి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డిజిటల్ విశ్లేషణ కోసం వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపే అవకాశం ఉందని సమాచారం.











