వైసీపీ అధినేత జగన్‌లో అసహనం, ఆందోళన తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలు ఘోరంగా విఫలమవుతున్నారని జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో కేవలం కొద్దిమంది నేతలు మాత్రమే హడావిడి చేస్తుండగా, మిగతా నియోజకవర్గాల నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోవడంపై జగన్ గుర్రుగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని పులివెందుల, తిరుపతి, రాయచోటి వంటి ప్రాంతాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై.ఎస్.అవినాష్ రెడ్డి వంటి నేతలు మాత్రమే ఎవరికివారే హడావిడి చేస్తూ, గొడవలు సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా వైసీపీ నేతల నియోజకవర్గాల్లో మాత్రం అలాంటి పోరాటాలు, హడావిడి కనీసం కనిపించడం లేదని జగన్ మండిపడినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల టైంలో రోడ్డెక్కి గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారంటూ ముఖ్య నాయకులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందు హంగామా చేసిన కొందరు కీలక నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారనే చర్చ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, అలాగే కర్నూలు జిల్లా వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలను జగన్ మందలించినట్లు సమాచారం. ఈ నేతలంతా పార్టీ తరఫున గళం విప్పడంలో, స్థానిక ఎన్నికల వేళ రచ్చ చేయడంలో తీవ్రంగా వెనకబడ్డారని జగన్ ఫైర్ అయినట్లు చర్చ జరుగుతోంది.
గొడవలు చేసేందుకు, కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసి, క్షేత్రస్థాయిలో వ్యతిరేకతను పెంచేందుకు ఇదే సరైన సమయమని జగన్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైలెంట్‌గా నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. యాక్టివ్‌గా లేని వారికి పదవులు, ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎందుకు అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.











