జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నప్పటికీ అసలు తాము అధికారంలో ఉన్నామనే స్థాయి మర్చి ప్రవర్తిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రెస్ మీట్‌లలో, బహిరంగ సభల్లో చెప్పే అబద్ధాలు సరిపోవన్నట్లుగా ఏకంగా హైకోర్టులోనూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ప్రభుత్వం తరపున ఏకంగా అడ్వకేట్ జనరల్ ఆ అబద్ధాలు చెబుతుండడం.. సర్కారు దిగజారుడు తనానికి, నిబంధనల ఉల్లంఘనకు అద్దం పడుతోంది. ఇసుక తవ్వకాల్లో భాగంగా.. ప్రభుత్వం చెప్పించిన మాటలకు, అంతకుముందు కమిషనర్ స్థాయి ఉన్నతాధికారి చేసిన ప్రకటనకు ఎక్కడా పొంతన ఉండకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ తీరు చూస్తుంటే.. క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు దోచుకుంటున్న తీరును అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని సులభంగానే తెలిసిపోతుంది.
బుధవారం ఏపీ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఇసుక తవ్వకాలపై విచారణ సందర్భంగా ధర్మాసనానికి వివరిస్తూ.. ‘‘ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ కు కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగియబోతుంది. కాబట్టి.. ఇసుక రీచ్‌ల్లో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగట్లేదు. గతంలో తవ్వి తీసి యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను మాత్రమే తరలిస్తున్నారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ఇసుక తవ్వకాలు చేస్తారని హామీ ఇస్తున్నాం’’ అని అన్నారు. అయితే గురువారం కూడా ఎన్నో జిల్లాల్లోని ఓపెన్ రీచ్‌ల్లో ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ఇసుక తవ్వకాలు దర్జాగా జరిగాయి.
గనుల శాఖ కమిషనర్ వీజీ వెంకట్ రెడ్డి నవంబర్ 25న మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఇసుక టెండర్లలో రెండు ఏజెన్సీలు సెలెక్ట్ అయ్యాయి. వాటితో ఒప్పందాల ప్రక్రియ చివరి దశలో ఉంది. అది పూర్తికాగానే ఆ సంస్థలు ఇసుక ఆపరేషన్స్ మొదలుపెడతాయి. అప్పటి వరకు పాత ఏజెన్సీ ద్వారానే అనుమతి ఉన్న అన్ని రీచ్‌ల్లో ఇసుక కార్యకలాపాలు జరుగుతాయి’’ అని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఓపెన్ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇవ్వలేనందన.. ఎక్కడా తవ్వకాలు జరగట్లేదని హైకోర్టులో చెప్పారు. కానీ పాత ఏజెన్సీ అయిన జేపీ సంస్థతో అన్ని రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతాయంటూ గనులశాఖ కమిషనర్ చెప్పిన ప్రకటన మరొకటి. ఈ స్థాయిలో వ్యవస్థల్ని నాశనం చేస్తూ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో ఈ పరిణామం తెలుపుతోంది.
ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా అనేక రీచ్‌ల్లో పర్యటించారు. ఆ అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకుంటే, కేవలం ఆ పూట తవ్వకాలు ఆపేసి.. మరుసటి రోజు నుంచి యథావిధిగా ఇసుక దోచుకోవడం కొనసాగిస్తున్నారు. ఈ మొండి వాదనతో జనం సైతం అవాక్కవుతున్నారు. వివిధ జిల్లాల్లోని ప్రధాన నదుల్లో ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ, అదేమీ లేదంటూ గనులశాఖ మొండిగా వాదిస్తూ ఉంది. కళ్ల ముందే భారీ పొక్లెయిన్ లతో ఇసుక తవ్వి, వందల లారీల్లో తరలిస్తున్నప్పటికీ అది నిజం కాదని అడ్డంగా వాదిస్తోంది.