(శ్రీకాకుళం/ విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నాడు – నేడు’ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే మొట్టమొదట ఈ పథకంపైనే సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు.
గోడలకు చెక్క సున్నాలు వేసి..
నాడు – నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు చెక్క సున్నాలు వేసి పెద్దఎత్తున వైకాపా కార్యకర్తలు డబ్బులు దోచుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాడు-నేడు పనులపైనే తొలి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. తుపాన్లతో పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని, నష్టపరిహారం చెల్లించకుండా వాయిదా వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చేతగాని తనంతో ..
ప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రంలో నేటివరకూ కరువు మండలాలను ప్రకటించలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా క్వింటాలు ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని విమర్శించారు. నిబంధనల పేరుతో రైతులను మోసం చేస్తే వారిని చైతన్య పరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
విజయనగరంలో మందకొడిగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించిన నాడు – నేడు పనులు విజయనగరం జిల్లాలో మందకొడిగా సాగుతున్నాయి. విజయనగరం జిల్లాలో 1040 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. రూ.236 కోట్లతో 4008 పనులకు ప్రతిపాదించారు. వీటిలో 1,874 పూర్తయ్యాయి. 2,134 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఆన్‌లైన్ గణాంకాల ప్రకారం 47 శాతం జరిగినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో 80 శాతానికి పైగా పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాకు ఇప్పటివరకు రూ.127.22 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.115.11 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని యాజమాన్యాల్లో కలిపి 236 పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. వీటిలో నాడు-నేడు పనులు జరుగుతున్నందున కొంత ఇబ్బంది ఎదురవుతోంది. ఇతర తరగతులు ప్రారంభిస్తే మరిన్ని ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది.
Also Read: మూడు ముక్కలాట.. టెక్కలి వైసీపీలో ముఠాలు