మనం కలవరపడి వెనుతిరిగితే కాలం ఎగబడి మీద పడుతుంది.ఎదురు తిరిగి చెలరేగితే కాలం భయపడుతుంది. కనురెప్పలు మూత పడితే కాలం జోకొడుతుంది. అదే కంఠమెత్తి తిరగబడితే కాలం జే,జే లు పలుకుతుందని ఒక కవి చెప్పారు. పట్టభద్రుల,ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే జరిగింది. ప్రజలు తిరగ బడ్డారు.జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్న విషయం మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన మూడు గ్రాడ్యు యేట్, జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి విద్యావంతులు విజ్ఞత ప్రదర్శించి అరాచక పాలకులకు బుద్ది చెప్పారు. అట్లాగే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం సాధించింది.23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా గెలుపొందారు.అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి పట్ల విశ్వాసం కోల్పోయి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో పంచుమర్తి అనురాధ గెలుపు సునాయాసమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరఓటమి నుంచి తేరుకోకముందే,ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి మరో పరాభవం ఎదురైంది. 22 ఓట్లు వస్తేనే గొప్ప అనుకున్నతెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థికి 23 ఓట్లు రావడంతో తెలుగుదేశం నాయకుల ఆనందానికి అవధుల్లేవు.చంద్రబాబు తన రాజకీయ చాణక్యతను మరోసారి ప్రదర్శించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చిఆ హామీలను గాలికి వదిలేసిన కారణంగానే పట్టభధ్రులు ఈ తీర్పు ఇచ్చారు. అయినా పట్టభద్రులలో గూడు కట్టుకున్న వ్యతిరేకతను ప్రభుత్వం గుర్తించక పోవడం వారి అహంకారానికి నిదర్శనం. ఎంఎల్‌సి ఎన్నికలను చిన్న ఎన్నికలుగా కొట్టిపారేసారు. ఈ తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినట్లు భావించడం లేదని బుకాయిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇదే నాయకులు రానున్న ఎన్నికలకు సెమీఫైనల్‌గా, రిఫరెండంగా సవాల్ చేసిన వారు ఫలితాలొచ్చాక నాలుక మడత వేశారు.అదే ఫలితాలు తమకి అనుకూలంగా వచ్చి ఉన్నట్లు అయితే మా ఘనత,మా పరిపాలన చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారని బాకాలూదుకొనేవారు. ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ఏమిటో స్పష్టoగా అర్ధం అవుతుంది.పట్టభద్రుల ఎన్నికలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, పాక్షిక దక్షిణాంధ్ర ప్రాంతాలు, తొమ్మిది జిల్లాలు, 108 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. దాదాపు ఎనిమిది లక్షల పైచిలుకు ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొని తీర్పు చెప్పారు.అయినా ప్రజా తీర్పును వైసిపి చులకన చేయడం వారి అహంకారానికి,అజ్ఞానానికి నిదర్శనం. ప్రజల తీర్పును గౌరవించకుండా ఇంకా కుంటి సాకులు వెతుకుతున్నారు. తెలుగుదేశం నాలుగు ఎమ్మెల్సీలు గెలవడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈ ఫలితాలు తెలుగు దేశం శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి.
అధికార పార్టీ వైసిపి.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యoగా దొంగ ఓట్ల దందా సాగించింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి విచ్చల విడి ప్రలోభాల జాతరకు తెగబడిన తీరు ప్రజాస్వామ్య వాదులను నిచ్చేష్టులను చేసింది. అన్ని అడ్డదారులు తొక్కుతూ లంచ్ బాక్సుల మొదలు, వెండి భరిణెలు, ఖరీదైన సెల్‌ఫోన్‌ల వంటి ప్రలోభాలకు గురి చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చూసినా పట్టభద్రుల విజ్ఞతే విజేతగా నిలిచింది.అడ్డ దారుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వారే గెలుస్తారేమో అని గుండె, గుండెలో గుబులు పుట్టిన వేళ ఆంధ్రప్రదేశ్ పట్టభధ్రులు ఇచ్చిన తీర్పు నిజమైన ఓదార్పు. విలువలు, విశ్వసనీయతకు తానే ప్రతిరూపం అని జగన్ చాటుకుంటున్నాప్రజల్లో ,సొంత ఎమ్మెల్యేలు జగన్ పట్ల విశ్వాసo కోల్పోయారు. పైగా తెలుగుదేశానికి బలం లేకపోయినా పోటీ పెట్టారు,మా సభ్యులను చంద్రబాబు ప్రలోభపెట్టారు అని సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. డబ్బుతో టిడిపి గెలిచిందని,కొనుగోలు చెయ్యక పొతే ఆ పార్టీకి 23 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు సజ్జల. మరి వైసిపి కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు సభ్యులు ఎన్నిక కావడానికే శాసనసభలో మీకున్న సంఖ్యాబలం ఆరుగురి కి మాత్రమే అయితే ఏడుగురిని ఎలా పెట్టారు? టిడిపి ఎమ్మెల్యేల సoఖ్య 23 అని వైసిపి కి తెలియదా? గత ఎన్నికల్లో 23 వ తేదీ 23 సీట్లు మాత్రమే వచ్చాయని దేవుడు స్క్రిప్ట్ బాగా రాసాడని ఎద్దేవా చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు 23 వ తేదీ 23 సీట్ల తో అనురాధను గెలిపించి దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాసిన విషయం గుర్తించాలి. ఆ రోజు దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాసాడని ఎగిరెగిరి పడ్డారు.ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం అని తెలుసుకోండి.ఎన్నికల్లో ఓడిపోయి ఓటమి భారంనుండి తప్పించుకోవడానికి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డింది వైసీపీ.
తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిపై కేవలం నాలుగేళ్లలోనే ఇంత ప్రజా వ్యతిరేకత రావడానికి కారణం ఆయనలో వున్నఅహంకారంమే .జగన్ కాలికి బలపం కట్టుకుని ఆ యాత్రా ఈ యాత్రా అంటూ ఏళ్లతరబడి జనం లో తిరిగిన జగన్‌ను చూసి జనం జాలిపడ్డారు.కానీ అతడిలోవున్న అంతర్ముఖుడిని చూడలేకపోయారు ప్రజలు.గంపలు కొద్దీ ఓట్లు వేసి గెలిపించారు. అవినీతికి తావులేని పాలన అందిస్తానని అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన బానిస వ్యవస్థగా మార్చేశారు. గిట్టనివారిపైకి జేసీబీ, ఏసీబీ, పీసీబీలను ప్రయోగించారు. ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలు, కంపెనీలపైకి పీసీబీని ప్రయోగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని గత ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్‌రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం అనే మత్తు లో సమస్త పన్నులు పెంచి పేదప్రజల నడ్డి విరిచారు. ప్రజలకు వర్తమానమే కాదు,భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మార్చారు.రాష్ట్రం నాశనం అవుతుంటే ప్రజలు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారు? తమ భవిష్యత్,రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు. అబద్దాలు నమ్మి, అధికారం ఇచ్చి ఆగమయ్యామని, జగన్ రెడ్డి ఎదో చేస్తాడని పెద్ద మెజారిటీ తో గెలిపించినా ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేమి లేదని, పరిపాలన జగన్ వల్ల కాదని,సమర్ధత,అనుభవం వున్న నాయకుడికి అధికారం ఇవ్వడం లో పొరపాటు పడ్డామని ప్రజలు గుర్తించారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరిందని చెప్పడానికి ఉత్తరాంధ్రా నుండి రాయలసీమ వరకు తొమ్మిది జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం అని చెప్పాలి.
రాష్ట్ర రక్షకుడు చంద్రబాబే నని ప్రజలు గుర్తించారు. అందుకే అనుభవం, సమర్ధుడు,దార్సనికుడు చంద్రబాబు మళ్ళి అధికారంలోకి రావాలని భావిస్తూ తెలుగుదేశానికి మద్దతు తెలిపేందుకు ప్రజలు సిద్దమవుతున్నట్లు ఎమ్మెల్సీ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.ఇంకా అధికార పార్టీకి మద్దతు ఇస్తే జరిగే పరిణామాలు ఏమిటో ప్రజలు గుర్తించారు. అందుకే విజ్ఞత ప్రదర్శించి విపత్తు నివారించుకొన్నారు పట్టభధ్రులు. మాట తప్పను,మడెమ తిప్పను,విశ్వసనీయత, విలువలు,నన్నే నమ్మండి అంటూ జగన్ వేసిన వల్లే వెతలను ప్రజలు విశ్వసించలేదు. అభివృద్దికి అనుభవజ్ఞుడు కావాలన్న ఆకాంక్షతోనే తెలుగుదేశం ఎమ్మెల్సీలను గెలిపించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మంచి పాలకులను ఎన్నుకునే స్వేచ్చ ప్రజలకే వుంది. ప్రజాగ్రహం ముందు మనీ పవర్,మజిల్ పవర్ నిలవ లేదు.మూడు రాజధానులకు మద్దతుగా నిలవబోమని ఉత్తరాంధ్రా ప్రజలు తేల్చి చెప్పారు. మళ్ళీ అధికారం నాదే, సిఎం పీఠం నాదే అంటూ 175 సీట్లు ఎందుకు గెలవలేమని విర్రవీగుతున్న అధికార పార్టీ నాయకుల అధికార గర్వం నేలమట్టం అయింది. పట్టభధ్రుల ఓటర్ల దెబ్బకు ఫ్యాన్ రెక్కలు ముక్కలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డింది వైసీపీ. కానీ ఓటర్లు విజ్ఞత ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో సుప్రీం అయిన ప్రజలు రాక్షస రాజకీయాన్ని సహించేది లేదని ఓటు ద్వారా రుజువు చేశారు. ఒక పక్కన జగన్ రెడ్డి అహంకార కోటలు కూలుతున్నా ప్రజల తీర్పును గౌరవించకుండా ఇంకా కుంటి సాకులు వెతుకడం సిగ్గు చేటు.