అనేక అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. అంతకుముందు ప్రతి శుక్రవారం తప్పకుండా కోర్టుకు హాజరుకావాల్సి వచ్చేది. సీఎం అయ్యాక ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లింది లేదు. ఇప్పుడు సీఎం పదవి పోయాక, ఆయన ఏ హోదాలో లేరు కాబట్టి, కోర్టుకు ఏ సాకులూ చెప్పడానికి వీల్లేదు. అయినా కూడా కోర్టుకు వెళ్లేందుకు జగన్ మోహన్ రెడ్డి సిగ్గుగా ఫీలవుతున్నట్లుగా చెబుతున్నారు.
తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం ష్యూరిటీ సమర్పించేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే విజయవాడలోని స్పెషల్ కోర్టు ముందు హాజరుకావడం జగన్ నామోషీగా భావిస్తున్నారని అంటున్నారు. ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. విజయవాడ కోర్టుకు జగన్ 3, 4 కి.మీ. దూరంలోనే ఉన్నారని.. అలాంటప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వ్యక్తుల హోదాలకంటే చట్టమే గొప్పదని.. ఇక్కడ గుర్తింపులు, హోదాలు పనికిరావని అన్నారు. కోర్టులు విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి తాను కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్లో పేర్కొంటూనే మరోవైపు ఆ షరతులను ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు. తనపై విజయవాడ కోర్టులో 2018లో నమోదైన పరువునష్టం కేసు గురించి జగన్‌కు తెలుసని అన్నారు. నేర చరిత్ర గురించి ఎన్నికల సంఘానికి తెలియజేసే క్రమంలో 2019, 2024 సంవత్సరాలకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్‌లో పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని నంబరుతో సహా ప్రస్తావించారని అన్నారు. పాస్‌పోర్టు కార్యాలయానికి తాజాగా వెళ్లాకే పరువునష్టం కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందని అబద్ధం చెబుతున్నారని అన్నారు. ఐదున్నరేళ్లుగా పరువు నష్టం కేసు విచారణను సాగదీస్తున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు.
జగన్ పాస్‌పోర్ట్‌ను ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని.. తమ ముందు హాజరై రూ. 20 వేల స్వీయ బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేనని అన్నారు. వాటి విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. ప్రస్తుత కేసు విషయంలో జగన్ వ్యవహార శైలిని దృష్టిలో పెట్టుకొని ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు. అయితే, పాస్‌పోర్టు పునరుద్ధరణకు విజయవాడ కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 11న ఈ వ్యవహారంపై తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ వీఆర్‌కే. కృపాసాగర్ తెలిపారు.