వైసీపీ పాలనలో ఏపీలో అరాచకం రాజ్యమేలిందని టీడీపీ సహా జనసేన, బీజేపీలతో పాటుగా వామపక్ష పార్టీలు కూడా నెత్తీ నోరూ బాదుకున్న తీరు అక్షరాలా నిజమేనని నిరూపితమైంది. ఏపీ సీఐడీకి మంగళవారం వచ్చిన ఓ ఫిర్యాదే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని చెప్పాలి. జగన్ హయాంలో నేరుగా ఆయన పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డ ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు దాష్టీకానికి పాల్పడ్డారని, ఈ దారుణాలు, దౌర్జన్యాలకు ఎంతోమంది బలి అయిపోయారని కూడా ఈ ఉదంతం చెబుతోంది. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతల కన్నుబడిన ఏ ఒక్కటి కూడా వారి కబంద హస్తాల్లో నుంచి బయటపడలేకపోయిందని కూడా చెప్పక తప్పదు.
కాకినాడ సీ పోర్టును అరబిందో ఫార్మాకు చెందిన అనుబంధ కంపెనీ అరబిందో రియాల్టీ ఏ రీతిన తన హస్తగతం చేసుకుందన్న తీరుపై పోర్టు మాజీ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు)ను వివరిస్తూ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు… ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులుగా జగన్ బాబాయి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నం విక్రాంత్ రెడ్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, సాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిలతో పాటు అరబిందో రియాల్టీ, శ్రీథర్ సంతానం ఎల్ఎల్ పీలను చేర్చారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతల దమనకాండ మొదలైపోయింందని నాడు విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు ఆరోపించాయి.ఈ ఆరోపణలు నిజమేనన్నట్లుగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో ఉండి కూడా సాయిరెడ్డి తన బెదిరింపుల పర్వాన్ని కొనసాగించారు. 2020లో ఒకానొక రోజు కాకినాడ పోర్టు, సెజ్ ల యజమానిగా ఉన్న కేవీ రావుకు సాయిరెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. సీపోర్టు వ్యవహారం గురించి విక్రాంత్ రెడ్డితో మాట్లాడుకోవాల్సిందిగా ఆయనకు సాయిరెడ్డి సూచించారు. విక్రాంత్ తో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా భేటీలో ఉంటారని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి ఎవరో తెలుసా?.. ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు రేపిన మద్యం కుంభకోణంలో అరెస్టైన అరబిందో ఫార్మా డైరెక్టరే ఈ శరత్ చంద్రారెడ్డి.
సాయిరెడ్డి ఫోన్ కాల్ తర్వాత కొన్ని రోజులకు నేరుగా విక్రాంత్ రెడ్డి నుంచి కేవీ రావుకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ లోని తన ఇంటికి రావాలని దాదాపుగా ఆదేశాలు జారీ చేసినంత పనిచేశారు. దీంతో జూబ్లీహిల్స్ లోని విక్రాంత్ రెడ్డి ఇంటికి కేవీ రావు వెళ్లగా… అప్పటికే అక్కడ శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వంలో అప్పటికే చాలా ఏళ్ల క్రితం సీపోర్టు చేసుకున్న రాయితీ ఒప్పందాలను ఉల్లంఘించారని, ఆ ఉల్లంఘనల విలువ రూ.965.65 కోట్లుగా తేలిందని ఓ ఆడిట్ నివేదికను కేవీ రావుకు విక్రాంత్ రెడ్డి ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇబ్బంది పడతారని బెదిరించారు.
సదరు ఆడిట్ నివేదిక తప్పని కేవీ రావు వాదించడంతో విక్రాంత్ రెడ్డి తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. స్వయంగా సీఎం జగనే సీ పోర్టుతో పాటు సెజ్ పై ఆసక్తి చూపుతున్నారని, జగన్ చెప్పినట్లుగా కంపెనీల వాటాలను అరబిందోకు విక్రయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. లాభాల్లో నడుస్తుండటంతో పాటు భారీగా ఆస్తులు ఉన్న కంపెనీలను ఎలా వదులుకుంటానంటూ కేవీ రావు అనడంతో విక్రాంత్ రెడ్డి నేరుగా బెదిరింపులకు దిగారట. మీతో పాటు మీ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు బనాయిస్తాం.. జైళ్లలోకి పంపిస్తాం. మీ మొత్తం వ్యాపారాలను మూయించివేస్తాం.. అంటూ విక్రాంత్ బెదిరించడంతో కేవీ రావుకు పరిస్థితి అర్థమైపోయిందట. అసలే అధికారంలో ఉన్న పార్టీ… అందులోనూ నేరుగా సీఎం పినతల్లి కుమారుడు విక్రాంత్ రంగంలోకి దిగిన నేపథ్యంలో తానేమీ చేయలేనన్న అంచనాకు వచ్చిన కేవీ రావుఅయిష్టంగానే సదరు ప్రతిపాదనకు అంగీకరించారట. ఇక అక్కడి నుంచి కాకినాడ సీపోర్టుతో పాటు కాకినపాడ సెజ్ లోని కేవీ రావు వాటాలను హస్తగతం చేసుకునే దిశగా పావులు కదిపిన విక్రాంత్… తనకు అనుకూలమైన ఆడిట్ సంస్థలను రంగంలోకి దించి ఆ రెండు సంస్థలను కారు చౌకగా రాయించేసుకున్నారట.
కాకినాడ సీ పోర్టులోని కేవీ రావుకు చెందిన 41 శాతం వాటా విలువ తక్కువలో తక్కువగా రూ.2,500 కోట్లు ఉండగా… దానిని అరబిందో రియాల్టీ కేవలం రూ.494 కోట్లకు దక్కించుకుంది. ఈ రేటుపై కేవీ రావు అభ్యంతరం తెలిపినా… విక్రాంత్ తనదైన శైలిలో బెదిరింపులకు పాల్పడి ఆయన నోరును మూయించేశారట. ఇక రూ.1,100 కోట్ల మేర విలువ ఉన్న కాకినాడ సెజ్ ను అయితే కేవలం రూ.12 కోట్లకు రాయించేసుకున్నారట. అంటే… 8 వేలకు పైగా ఎరకాల భూములు ఉన్న సెజ్ ను అరబిందో రియాల్టీ దాదాపుగా ఉచితంగా చేజిక్కించుకుందన్న మాట. ఈ ఒప్పందాలు పూర్తి అయిన తర్వాత కేవీ రావును విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు స్వయంగా దగ్గరుండి మరీ విజయవాడలోని జగన్ వద్దకు తీసుకెళ్లారట.
ఈ సందర్భంగా కేవీ రావు ముందే ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్ కు విక్రాంత్ వివరించారట. ఆ తర్వాత తనను అన్యాయంగా ఇబ్బంది పెట్టారంటూ కేవీ రావు చెప్పబోగా… ఆయన మాట్లాడేందుకే అవకాశం ఇవ్వని జగన్… విక్రాంత్ చెప్పినట్లుగా వినాలని చెప్పారట. ఇలా తన నుంచి తన కంపెనీలను విక్రాంత్ ఎలా రాయించుకున్నారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా కేవీ రావు తన ఫిర్యాదులో తెలిపారు. సీఎం హోదాలో ఉన్న జగనే ఈ మొత్తం వ్యవహారానికి మూలకారణమని కూడా రావు తన ఫిర్యాదులో ఆరోపించారు. మరి ఈ కేసును సీఐడీ అదికారులు ఎలా డీల్ చేస్తారో, బాధితుడికి ఏ రీతిన న్యాయం చేస్తారో చూడాలి.