ఏపీ రాజకీయాల్లో వైసీపీ పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో.. ఆ పార్టీకి చెందిన నాయకులు చాలా మంది పార్టీవీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు పార్టీని కాపాడుకోవడంతోపాటు.. ఇంటి సమస్యలను కూడా చక్కబెట్టుకోవల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆస్థి పంపకాల్లో చెల్లి వైఎస్ షర్మిలతో ఉన్న సమస్యల నేపథ్యంలో వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ ప్రయత్నాలు ఏపీలో కాకుండా బెంగళూరు వేదికగా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దెబ్బకు వాస్తవంలోకి దిగొచ్చారు. రాబోయే రోజుల్లో తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే నాలుగు మెట్లు దిగక తప్పదని గ్రహించిన జగన్.. మరో దిక్కు కానరాక చెల్లెలు షర్మిలతో రాయభారానికి సిద్ధమయ్యారు.
తాను అధికారంలోకి రావడానికి కారణమైన సొంత చెల్లి వైఎస్ షర్మిలను తాను అధికారంలోకి వచ్చిన తరువాత 2019 నుంచి నానా రకాలుగా వేధించిన వైసీపీ అధినేత దిగొచ్చి.. రాజీ కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యారు. తన తండ్రి ఆస్తిలో వాటాలు పంచేందుకు అంగీకరించారు. దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బ్రతికుండగా.. తన ఆస్తిలో కుమార్తె షర్మిలకు సమాన వాటా ఉండాలని అనేక సందర్భాల్లో చెబుతుండేవారు. అయితే వైఎస్ మరణానంతరం షర్మిలకి వాటా ఇచ్చేందుకు జగన్ ససేమిరా అన్నారు. అంతేకాదు ఆమెను పలు రకాలుగా వేధించారు. ఇంటి నుంచి దాదాపు వెలివేసినంత పని చేశారు. అది సరికాదని వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన చాలా మంది చెప్పి చూసినా జగన్ ఖాతరు చేయలేదు. తండ్రి వైఎస్ మాటను నెరవేర్చాలని ఆయనకు ఎంతగా నచ్చజెప్పినా.. ఆస్తుల పంపిణీకి ససేమిరా అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన షర్మిల.. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. జగన్ అసలు స్వరూపం అర్థమవ్వడంతో.. పోరాటం తప్ప మరో మార్గం లేదని గ్రహించారు షర్మిల. తన హక్కుల కోసం ఆమె జగన్‌తో ధర్మ యుద్ధమే చేయాల్సి వచ్చింది.
సొంతంగా పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిల.. రాజకీయ రంగ ప్రవేశాన్ని జగన్ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. ఆమె తెలంగాణకు పరిమితం కావడంతో తనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నట్లు మిన్నకుండిపోయారు. తన మొండి వైఖరిని కొనసాగించారు. అయితే మొన్న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఏకంగా రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల.. జగన్‌పై పదునైన విమర్శలతో కత్తి దూయడంతో జగన్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. తనకు జరిగిన అన్యాయాన్ని షర్మిల ఊరూవాడా ఎలుగెత్తి చెబుతూ, జగన్ నిజ స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. మరోవైపు చిన్నాన్న కుమార్తె సునీత కూడా షర్మిలకి తోడవ్వడంతో.. ఇద్దరు చెల్లెళ్లూ ఏకమవ్వడంతో.. సొంత జిల్లా కడపలోనే పరిస్థితి జగన్‌కి వ్యతిరేకంగా మారిపోయింది.
సొంత చెల్లెళ్లకు అన్యాయం చేయడం సరికాదన్న మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దానికి తోడు తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో షర్మిలపై అసభ్యకరమైన దూషణలతో దాడి కూడా చేయించారు. దీంతో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో .. ఆ తర్వాతి పరిణామాలు జగన్‌కు వ్యతిరేకంగా మారిపోయాయి. ఓటమి తర్వాత సొంత పార్టీలోని కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా దూరమవడం … కేవలం భజన బృందం తప్ప తటస్థులూ, కాస్తో కూస్తో పద్ధతిగా ఉండేవారు కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం మొదలెట్టారు.
జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో ఉస్కో అనగానే రెచ్చిపోయి విచ్చలవిడిగా వ్యవహరించిన వైసీపీ నేతలపై నారా చంద్రబాబు నాయుడి సర్కారు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ పరిస్థితిలో వైసీపీ మనుగడ సాగించాలన్నా, తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా ఏదో ఒక జాతీయ పార్టీ సహకారం అవసరమన్న వాస్తవం జగన్‌కు అర్థం అయింది. అయితే జాతీయ పార్టీ అయిన బీజేపీ తనను ఎలాగూ దగ్గరకు రానివ్వదు కాబట్టి కాంగ్గ్రెస్ వైపు తన వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. గడచిన ఐదేళ్లూ జగన్‌కు మద్దతిచ్చిన బీజేపీ.. ఎన్నికల వేళ ఆయన్ను వదలి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమి కట్టింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు వెళ్లలేని పరిస్థితి. కాంగ్రెస్‌తో జతకట్టడానికి సిద్ధమైన జగన్.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దగ్గరకి రాయభారం కోసం వెళ్లారు. జగన్ విషయంలో ఆయన కొంత సాఫ్ట్‌గా ఉంటారనే ప్రచారం ఉంది.
కాంగ్రెస్ వైపు వెళ్లాలంటే తన సొంత చెల్లి షర్మిల సమస్యగా మారింది. ప్రస్తుతం ఆమె చిన్నా నాయకురాలేమీ కాదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు. ఆమెతో ఘర్షణ కొనసాగిస్తే తనకు కాంగ్రెస్ వైపు చూసే చాన్స్ ఉండదని జగన్‌కు అర్థమైంది. కాంగ్రెస్ అండ లేకపోతే భవిష్యత్తు శూన్యమని గ్రహించిన జగన్.. గత్యంతరం లేక చెల్లితో రాయబేరాలు నడపడం మొదలెట్టారు. గత కొద్దిరోజులుగా తరచూ బెంగళూరు వెళ్లి, షర్మిలతో ఆస్తుల పంపకాలకు సంబంధించిన మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలతో జరిపిన చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
షర్మిల కోరిన విధంగానే ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి జగన్ ఓకే అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ తన మాట నిలబెట్టుకుంటే ఆయనను కాంగ్రెస్‌కి దగ్గర చేయడానికి షర్మిల కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ .. ఇప్పటికిప్పుడు అటువంటి చర్యకు జగన్ సిద్ధం కాకపోవచ్చు.. భవిష్యత్‌లో జరిగినా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌తో దోస్తికి మాత్రమే జగన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.