ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి విమానం ఎందుకంటూ గతంలో హేళన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగడం చర్చనీయాంశమైంది. ఆనాడు ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు పన్నారు జగన్. ఐతే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఎయిర్‌పోర్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసింది.
జగన్ వైఖరిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాడు వైసీపీ అధినేత భోగాపురం ప్రాజెక్టును ఎంతగానో ఎద్దెవా చేశారని, కానీ నేడు అదే ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో రావడం ఆయన రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఎత్తిచూపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కాలరాసేలా మాట్లాడినందుకు జగన్..ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పట్టుబట్టి ఎయిర్‌పోర్టును పూర్తి చేసిన చంద్రబాబు నాయుడిని అభినందించే పెద్దమనుసు కూడా జగన్‌కు లేదని కలిశెట్టి విమర్శించారు. ఉత్తరాంధ్ర విస్తృతంగా తిరిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని కళ్లతో చూసి వెళ్లాలని జగన్‌కు హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునేవాళ్లకు ప్రజలే తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
మొత్తానికి, భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో వైఎస్ జగన్ గతంలోని మాటలకు, నేడు ఆయన చేస్తున్న పర్యటనకు పొంతన లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మాట మార్చడంలో జగన్ మరోసారి తన నైజాన్ని చాటుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసైనా జగన్ తన రాజకీయ కుట్రలు మానుకోవాలని, లేదంటే ప్రజలు జగన్ పూర్తిగా తిరస్కరిస్తారని గుర్తు చేస్తున్నారు.











