ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తన వీకెండ్ కామెంట్స్ తో జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా ఆయన వీకెండ్ కామెంట్స్ లో జగన్ ఫ్యామిలీ సీక్రెట్స్ పై అందిస్తోన్న కథనాలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.. తాజాగా ఆయన మరోసారి జగన్ కుటుంబంలోని రహస్యాలను వివరిస్తూ ప్రచురించిన కథనం.. వైసీపీని కుదిపేస్తోంది.. ముఖ్యంగా వివేకా హత్య కేసుతోపాటు జగన్, షర్మిల మధ్య ఆస్తుల విభజన, రాజకీయ రగడపై ఏబీఎన్ ఎమ్ డీ రాధా కృష్ణ రాసిన కథనం.. ఇప్పటిదాకా వెలుగులోకి రాని అనేక అంశాలను తెరమీదకు తెచ్చింది..
ఈ కథనం ప్రకారం.. జగన్, షర్మిల మధ్య వివాదం ఆస్తుల విభజన కోసమే మొదలయిందని తెలిపారు ఆర్ కే.. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆస్తులని పంచడానికి క్రైస్తవుల పవిత్ర స్థలం జెరూసలేం సాక్షిగా జగన్ చేసిన ప్రతిపాదన అమలులోకి రాలేదని, అది షాకింగ్ గా ఉందని వివరించారు ఏబీఎన్ ఎమ్ డీ రాధా కృష్ణ.. తనకు ముందు చేసిన వాగ్ధానానికి భిన్నంగా అనేక ఆస్తులను పంచలేదని, దీనిపై షర్మిల తీవ్రంగా విబేధించారని తెలిపారు. తనకు ముందుగా ఇస్తానన్న సరస్వతి సిమెంట్స్ తోపాటు పలు ఆస్తులపై మాట మార్చారని వెల్లడించారు.. షర్మిల మైనింగ్ వ్యవహారాలను సైతం దారుణంగా దెబ్బకొట్టారని, టీడీపీ సర్కార్ లో సైతం తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగలేదని, కానీ, సొంత సోదరుడే బిజినెస్ ని టార్గెట్ చేయడం షర్మిలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందని తెలిపారు ఆర్ కే. ఇటు రాజ్యసభ సీటు ఇస్తారన్న అంశంపైనా తన సోదరుడు జగన్ పునరాలోచన చేశారని గుర్రుగా ఉన్న షర్మిల.. ఆయనపై ఫైట్ కి రెడీ అయ్యారని వివరించారు. ఈ పరిణామాల తరవాతే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ.
గత కొంతకాలంగా షర్మిల భర్త అనిల్.. తన బావ జగన్ ఓటమికి ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు ఆర్ కే.. క్రైస్తవులలో విపరీత ఆదరణ, పట్టు ఉన్న బ్రదర్ అనిల్… వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని క్యాంపెయినింగ్ చేస్తున్నారని, ఇది తన ఓటు బ్యాంక్ కి గండి కొడుతుందని భావించిన జగన్.. రాజీ ఫార్ములాకి వచ్చారని ఈ కథనంలో ప్రస్తావించారు ఆర్ కే.. ఆస్తులను 2024 ఎన్నికల తర్వాత విభజిద్దామని, అప్పటివరకు తనకు సహకరించాలని కోరారట. అయితే, ఈ ప్రపోజల్ కి షర్మిల, ఆమె భర్త అనిల్ ఎంతమాత్రమూ అంగీకరించలేదు..
షర్మిలను ఒప్పించాలని తల్లి విజయలక్ష్మి దగ్గరికి ఇప్పటికే రెండు మూడు టీమ్ లని పంపించారు జగన్.. ఆస్తుల విభజనపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా తాను ఏమీ చేయలేనని ఆమె తెలిపారట.. ఈ టీమ్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి రెండు సార్లు విజయలక్ష్మిని కలిశారట.. అయినా షర్మిల, విజయలక్ష్మిని ఒప్పించడంలో విఫలం అయ్యారు సజ్జల..
ఇక్కడితో ఆగలేదు రాధా కృష్ణ.. తన గత వీకెండ్ కామెంట్ లో వివేకా హత్య జరిగిన రోజు జగన్ నలుగురితో మీటింగ్ లో ఉన్నారని, వారి పేర్లను సైతం వెల్లడించారు ఆర్ కే.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ సహాయకుడు కృష్ణ మోహన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లంతోపాటు మరో వ్యక్తి ఉన్నారని తెలిపారు. ఈ కథనంపై వైసీపీ పొల్లెత్తు మాట అనలేదు.. కనీసం ఖండించలేదు. దీనిపై వివరణ ఇస్తే ఇంకా మరెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో అనే భయమే షాకింగ్ గా మారిందట. అందుకే, వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారట జగన్, వైసీపీ..
మరి, కనీసం షర్మిల, జగన్ ఆస్తుల విభజన అంశాలపైన అయినా వైసీపీ కౌంటర్ ఇస్తుందా…? సైలెంట్ అవుతుందా అనేది చూడాలి.