రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలనే తీవ్రమైన యోచనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ, ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చాక ఎన్నికల బరికి దూరంగా ఉండాలని భావించడం వెనుక క్షేత్రస్థాయి సమీకరణాలు, నాయకుల వైఖరి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ తరఫున అభ్యర్థులు ముందడుగు వేయకపోవడమే జగన్ ఈ తరహా నిర్ణయానికి వచ్చేలా చేస్తోందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత క్షేత్రస్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రస్తుత అధికార కూటమి నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని ప్రచారం చేయడం, నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయడం తమకు సాధ్యం కాదనే భావన నాయకుల్లో వ్యక్తమవుతోంది.
అభ్యర్థులు వెనకడగానికి మరో కీలక కారణం విపరీతమైన ఆర్థిక భారం. స్థానిక పోరులో గెలవాలంటే భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ ఎన్నికల్లోనే రూ. కోట్లలో ఖర్చు చేసి నష్టపోయిన నాయకులు, ఇప్పుడు మళ్లీ సొంత సొమ్మును ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరు. పార్టీ తరఫున ఆర్థిక మద్దతు లభించకపోతే పోటీ చేసి మళ్లీ నష్టపోవడం కంటే ఎన్నికలకు దూరంగా ఉండటమే మేలని అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
అభ్యర్థుల కొరత, ఆర్థిక పరిమితుల వల్ల క్షేత్రస్థాయిలో సరైన అభ్యర్థులు నిలబడకపోతే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా పోటీలోకి దింపి మధ్యలోనే చేతులెత్తేసే కంటే, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని నిరసిస్తూ బహిష్కరణ బాట పట్టడమే రాజకీయంగా, వ్యూహాత్మకంగా శ్రేయస్కరమని వైసీపీ అధినేత ఆలోచిస్తున్నట్లు సమాచారం.











