పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..
ఇంటింటికి స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు..భూమిలో పాతే సర్వేరాళ్లపైనా తనబొమ్మే..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చ పరాకాష్టకు చేరింది. ఇంటింటికి స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు, గడప గడపకూ పాంప్లెట్లు..గత ప్రభుత్వం కట్టిన బిల్డింగులు, వాటర్ ట్యాంకులకు వైసిపి రంగులు..సచివాలయాల నేమ్ బోర్డులపైనా జగన్ బొమ్మలే…చివరికి విద్యార్ధులకిచ్చే స్టడీ మెటీరియల్ పై, ఆస్పత్రి రోగుల ఓపీ రశీదులపైనా, భూమిలో పాతే సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మలే..
ఇప్పటికే ‘‘గడపగడపకూ’’ వైసిపి కార్యక్రమంలో వెళ్లిన ప్రతిచోటల్లా ఎమ్మెల్యేలకు నిలదీతలు, శృంగభంగాలే..ప్రజల్లో వ్యతిరేకత చూసే వాళ్లూ గడపగడపకెళ్లాలంటే ముఖం చెల్లడం లేదు. వెళ్లనివాళ్లకు సమీక్షల్లో సీఎం జగన్ తలంటు పోసినా మార్పులేదు, వెళ్తే జనం కాలర్ పుచ్చుకుంటున్నారనే భయం నెలకొన్న నేపథ్యంలోనే ఈ సైకో ప్రచార కక్కుర్తి అన్నమాట..
‘మా నమ్మకం నువ్వే’ అని ఇంటింటికి స్టిక్కర్లు ఇప్పటికే బూమ్ రాంగ్ అయ్యాయి..‘‘మా దరిద్రం నువ్వే’’ అనే స్టిక్కర్లు దర్శనమివ్వడం చూసి కంగుతింటున్నారు. తాజాగా ఇప్పుడు చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ సెల్ ఫోన్లకు స్టిక్కర్ల పరిస్థితి తల్చుకుంటేనే భీతిల్లుతున్నారు..
ఈ ప్రచార బాధ్యతను తలకెత్తుకున్న 5.65లక్షల మంది గృహ సారథులు, 2.66లక్షల మంది వలంటీర్లు, లక్షా 34వేల మంది సచివాలయ సిబ్బంది పరిస్థితి మింగలేక కక్కలేకగా మారింది.
ఇప్పటికే అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం, యూనివర్సిటీలకున్న పేర్లు తీసేయడం, గతంలో కట్టిన బిల్డంగులకు వైసిపి రంగులేయడం, పాలకుల పైశాచిక మానసిక స్థితికి అద్దం పట్టాయి. ఈ నేపథ్యంలో ఇంటింటికి స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు జగన్ రెడ్డి ప్రచార పిచ్చకు పరాకాష్ట. ఇంటింటికీ స్టిక్కర్లు కాదు, మీ ఎమ్మెల్యేల ముఖాలకు పచ్చబొట్లు వేసుకోండన్న నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు జనాభిప్రాయమే..
జగనన్న పేరుతో ఇప్పటికే అనేక పథకాలతో జనం విసిగిపోయారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న విద్యా కానుక,జగనన్న అమ్మవడి, జగనన్న భూహక్కు- భూరక్ష, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లు..తండ్రీ కొడుకుల పేర్లతోనే వెల్ఫేర్ స్కీములన్నీ నింపేయడం వెగటు పుట్టించింది.
పాతస్కీముల పేర్లను చెరిపేసి తనపేరు, తండ్రిపేరే పెట్టుకోవడం జగన్ రెడ్డి కీర్తికండూతి అనాల్నా, ప్రచార పిచ్చ అనాల్నా..? చివరికి తండ్రి కొనసాగించిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరుకూడా మార్చడం దుస్సాహసం కాక మరేంటి..?
విద్యార్ధులకిచ్చే స్టడీ మెటీరియల్ పైనా సీఎం జగన్, జడ్పీ ఛైర్మన్ లబొమ్మలే, మహనీయుల బొమ్మలను చిన్నవిగా వేసి వీళ్ల బొమ్మలు మాత్రం పెద్దవి వేయడం విడ్డూరం కాక మరేమిటి..? చివరికి ఆస్పత్రికి వచ్చే రోగులకిచ్చే ఓపీ రశీదులపై కూడా జగన్ బొమ్మలే చూసి, వాళ్ల రోగం తగ్గడం దేవుడెరుగు మరింత అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది..
అరే, భూమిలో పాతే సర్వే రాళ్లపై కూడా మీ బొమ్మలేనా..? పిచ్చ కాకపోతే ఏమనాలి దీన్ని..? ‘జగనన్న భూహక్కు-భూరక్ష’ పేరుతో జగన్ ఫొటోలతో 3కోట్లకు పైగా గ్రానైట్ సర్వేరాళ్ల తయారీకి మైనింగ్ శాఖ గ్రానైట్ కటింగ్ , పాలిషింగ్ యూనిట్ల వారిని వేధించడం తెలిసిందే..30లక్షల్లో 20లక్షల సర్వేరాళ్లు ప్రకాశం జిల్లా యూనిట్లనుండి, మిగిలినవి చిత్తూరు, అనంతపురం, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, అనకాపల్లి యూనిట్లు ఇవ్వాలని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు.
ఈ ‘‘సైకో శిలాశాసనాలేంటిరా’’ బాబూ అంటూ వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో రాయికి రూ 300ఇస్తామని డిసెంబర్ కల్లా 30లక్షల సర్వేరాళ్లు పూర్తికావాలని వేధించడంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మొదట రూ1160 ఇస్తామని, తర్వాత రూ 490కి తగ్గించి ఇప్పుడు 300కే ఇవ్వాలనడాన్ని నిరసిస్తున్నారు.
ఇప్పటికే గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఏ బోర్డు చూసినా జగన్ రెడ్డి బొమ్మలే.. ప్రభుత్వ కార్యాలయాల లోపల, బయటా ఆయన బొమ్మలే..మొత్తం ఎటుచూసినా తన బొమ్మలే కనబడాలనే జగన్ రెడ్డి ప్రచార పిచ్చ వికటించే ప్రమాదముందని ఆ పార్టీ సీనియర్లే వాపోతున్నారు.
చంద్రబాబు హయాంలో కట్టిన పంచాయతీ భవనాలు,అంగన్ వాడీ భవనాలు, టిడ్కో భవనాలు, వాటర్ ట్యాంకులు అన్నింటికీ వైసిపి రంగులేయడం తెలిసిందే..ఈ రంగులేయడానికే రూ 2వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని మీడియాలో చూశాం. దానిపై కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో కోర్టు ఆదేశాలతో మళ్లీ ఆ రంగులను మార్చాల్సి వచ్చింది. రంగులు మార్చడానికి మరో రూ 2వేల కోట్లు వృధా చేయడం తుగ్లక్ చర్యగా అభాసు పాలయ్యారు.
జగన్మోహన్ రెడ్డి సొంత పేపర్ సాక్షికి గవర్నమెంట్ యాడ్స్ వివాదాస్పదం విదితమే. మూడేళ్లలో దాదాపు రూ 300కోట్ల ప్రజాధనం సొంత పేపర్ కు యాడ్స్ రూపంలో కట్టబెట్టిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే చూడలేదు. చివరికి కరోనా కల్లోలంలోనూ రూ 100కోట్లు సాక్షికి కట్టబెట్టారంటే ఏమనుకోవాలి..? 6నెలల్లో రూ 60కోట్ల యాడ్స్ కింద దుర్వినియోగం చేశారు. అంటే నెలకు రూ 10కోట్ల చొప్పున పత్రికా నిర్వహణకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి రాబట్టడం జగన్ మార్క్ దోపిడీ కాక మరేమిటి..? సొంత పేపర్ సాక్షి కొనేందుకే వలంటీర్ల ద్వారా ప్రతినెలా రూ 200 ప్రభుత్వ ఖజానాకు చిల్లుబెడ్తున్నారంటే ఇలాంటి బెజ్జాలు ఇంకెన్నో..?
పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లు తయారైంది వీళ్ల పరిస్థితి..పథకానికి రూ కోటి, ప్రచారానికి రూ 3కోట్లట..లా నేస్తం పథకానికొచ్చిన తిప్పలివి..జనవరి నెలకు 2011మంది లాయర్లకు రూ కోటి ఇస్తే, దాని పబ్లిసిటీకి చేసిన ఖర్చు రూ 3కోట్లు అక్షరాలా..ఇదేమైనా ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన పథకమా..? కాదే.. ఇది వరుసగా 4వ ఏడాది ఇస్తున్న అంతంత మాత్రం సాయం, దానికీ ఇంత బిల్డపా..?
ఇతని పైశాచిక ప్రచార కక్కుర్తికి దుర్వినియోగం చేసిన ప్రజాధనంతో 5ఏళ్లపాటు అన్నా కేంటిన్లు నడపవచ్చు, పేదలకు రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుకలు ఇవ్వవచ్చు. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిచేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చి అన్నదాతలను ఆదుకోవచ్చు, పోలవరం పనులు మరో 10-15% పూర్తి చేయవచ్చు..ఆదరణ పథకం కింద లక్షలాది బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ఉపాధికి ఆధునిక పనిముట్లు ఇవ్వవచ్చు..ఇవన్నీ తోసిరాజని తన సొంత మీడియా బొజ్జ నింపడమే జగన్ రెడ్డి ఎజెండా..
‘‘సమయానికి ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వం మీడియాలో ప్రకటనలకు మాత్రం వందలకోట్ల నిధులను దుర్వినియోగం చేస్తోందని’’ కేంద్రమంత్రి అన్నమాటలు ఏపి నుద్దేశించే.. అయినా ఇవన్నీ దున్నపోతుమీద వర్షమే..నలుగురు నవ్విపోదురు, నాకేటి సిగ్గన్నట్లుంది వీళ్ల వికృత పోకడ..
బటన్ నొక్కి పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నా అనేది పైమాటే.. పేదల పేరుచెప్పి తన సొంత ఖజానాలో వందల కోట్లు వేసేందుకే పదేపదే ఈ బటన్ నొక్కుడు-ప్రకటనల పిచ్చ అనేది ఇప్పటికే ప్రతి ఒక్కరికీ అర్ధమైంది..గతంలో ప్రభుత్వాలు బటన్ నొక్కినవే, కానీ వాళ్లేమీ ఇలా చేయలేదే, ప్రజాధనం దుర్వినియోగం…? ‘‘నేతి బీరలో నెయ్యి’’ చందమే జగన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమం.. మజ్జిగనీళ్లు ప్రజలకు పోసి, మీగడ, వెన్న తాను జుర్రుకుంటున్నాడనేది అందరికీ అవగతమైంది. ఎప్పుడెప్పుడు ఈ పైశాచిక పాలనను, సైకో పార్టీని ఇంటికి పంపాలా అని ఎదురెదురు చూస్తున్నారు.
—-