వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇవాళ టైం వాళ్ళది, కొడతారు, కొట్టించుకుందాం, కానీ ఎల్లకాలం ఇలాగే ఉండదు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో తాత్కాలికంగా ఉత్సాహం నింపే ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దేవుడు, ప్రజలు కలిసి సింగిల్ డిజిట్‌కు పడేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ మాటల వెనుక జగన్‌కు అర్థం కాని అతిపెద్ద వాస్తవం మరొకటి ఉంది.
అదేంటంటే, గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ పార్టీకి కేవలం 11 MLA సీట్లే ఇచ్చి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కోలుకోలేని దెబ్బతీశారు. దీన్ని రాజకీయ విశ్లేషకులు కేవలం ఓటమిగా కాకుండా, ఐదేళ్ల పాలనపై ప్రజలు విధించిన తీర్పుగా, ఒక రకంగా దేవుడి శాపంగా అభివర్ణిస్తున్నారు. 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కేవలం 11 స్థానాలకు పరిమితమవ్వడం అనేది వైసీపీ పాలనా వైఫల్యాలకు నిదర్శనమని విపక్షాలు బలంగా వాదిస్తున్నాయి. ఈ ఘోర పరాజయాన్ని జగన్ ఇంకా పూర్తిగా బేరీజు వేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజలు తమ తీర్పు ద్వారా ఇప్పటికే జగన్‌కు స్పష్టమైన సంకేతం పంపినప్పటికి జగన్ మారడం లేదు. గడిచిన ఎన్నికల్లో వచ్చిన 11 సీట్ల నిజాన్ని అంగీకరించి, ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి, మళ్లీ 2029లో ప్రత్యర్థులు పడిపోతారంటూ జోస్యం చెప్పడం కేవలం కార్యకర్తలను మభ్యపెట్టడమే అవుతుంది. ప్రజల నాడిని అర్ధం చేసుకోకుండా, గత అనుభవాలను బేరీజు వేసుకోకుండా చేసే ఇటువంటి ప్రకటనలు ఆ పార్టీకి మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది.
మొత్తంగా చూస్తే, జగన్ తన ప్రసంగాల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం ప్రదర్శించినప్పటికీ, ఆయన పార్టీ నేతలు కార్యకర్తలు మొదట గ్రహించాల్సింది ప్రజలు ఇచ్చిన 11 సీట్ల తీర్పు గురించే. ఆ సంఖ్య కేవలం ఒక అంకె మాత్రమే కాదు, జగన్ పాలనపై ప్రజల ఆగ్రహానికి ప్రతీక. ఈ వాస్తవాన్ని గ్రహించి తప్పులను సరిదిద్దుకోకపోతే, భవిష్యత్తులో జగన్‌కు మరిన్ని రాజకీయ ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు.











