చుట్టాలొస్తున్నారంటే చాలా మంది భయపడతారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఈ విషయంలోనూ రివర్సే. జగన్ ఎవరికీ భయపడరని అందరికీ తెలుసు కానీ. జగన్ పేరు తలుచుకొన్నా ఆయన బంధువులంతా భయంతో వణికిపోతున్నారట. మాజీ సీఎం క్లోజ్ రిలేటివ్.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే జగన్ బంధువు కాదు రాబందువు అని ఏకంగా పబ్లిక్ మీటింగ్‌లోనే సంచలన ఆరోపణలు చేశారు. నిజంగానే జగన్ తన చుట్టాలను అంతగా ఇబ్బంది పెట్టారా.. బాలినేని కాకుండా జగన్ కారణంగా నష్టపోయి.. కష్టాలు అనుభవించిన బంధువులు ఇంకెంత మంది ఉన్నారు..??
మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ధనవంతుడు అయిన జగన్‌లాంటి వ్యక్తితో బీరకాయ పీచు చుట్టరికం అయినా ఉండాలని చాలా మంది కోరకుంటారు. కానీ జగన్ బంధువుల్లో చాలా మంది ఆయనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్‌తో బంధుత్వం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన చుట్టాల్లో చాలా మంది పబ్లిగ్గానే చెప్పుకుంటున్నారు.
జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్‌రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు జగన్. వైసీపీ నాయకత్వం, ఆ పార్టీ అనుకూల మీడియా మొత్తం వివేకానందరెడ్డి కుమార్తె సునీతపైనే రివర్స్ ఎటాక్ చేసింది. వివేకా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు రాసి, ఆస్తి కోసం సునీత భర్తే వివేకాను చంపించాడని ప్రచారం చేశారు. వివేకా హత్య కేసు విషయంలో జగన్ తీరుతో తీవ్ర ఆవేదన చెందిన సునీత.. ఇలాంటి అన్న ఉండటం తన దురదృష్టమని వాపోయారు.
ఆస్తి పంపకాల విషయంలో సొంత తల్లిని, చెల్లిని కూడా వదిలిపెట్టలేదు వైసీపీ అధినేత. రాజకీయంగా తనతో విభేదించిందనే కారణంతో ఆస్తిలో తన వాటా ఇవ్వలేదని జగన్‌పై ఆయన సోదరి షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో వారి తల్లి వైఎస్ విజయ, షర్మిలకు మద్దతుగా నిలిచారు. చెల్లెలికి సపోర్ట్ చేసిందనే కారణంతో ఎప్పుడో తల్లికి రాసిచ్చిన సరస్వతి పవర్ షేర్లను తిరిగి తనకు ఇప్పించాలని కోర్టుకెక్కారు మాజీ ముఖ్యమంత్రి. చెల్లెలిపైనా, తల్లిపైనా ఇప్పుడు తనకు ఎలాంటి ఆప్యాయత లేదని.. మొహమాటం లేకుండా చెబుతున్నారు. రాజకీయంగా విభేదించిన చెల్లిపైనే ఇంత శతృత్వం పెంచుకుంటే.. ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై ఇంకెంత కోపంతో రగిలిపోతున్నారో అని జనం అనుకుంటున్నారు.
ఇక జగన్‌కి మరో దగ్గరి బంధువు అభిషేక్ రెడ్డి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇక జగన్‌కి అత్యంత ఆప్తుడైన విజయసాయిరెడ్డి వైసీపీని వదిలేసి.. జగన్‌తో కటీఫ్ చెప్పారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే.. జగన్ తన ఆస్తులు కాజేశాడని పబ్లిక్ మీటింగ్‌లోనే ఆరోపించారు. తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తులను కూడా కొట్టేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషయంలో త్వరలో మరిన్ని విషయాలు బయటపెడతానని టీజర్ రిలీజ్ చేశారు. ఈ వ్యవహారాలన్నీ చూశాక.. జగన్‌తో జర భద్రం అని ఆయన బంధు-మిత్రులు, అనుచరులు భావిస్తే.. అది వారి తప్పు కాదనే అనుకోవాలి.