‘‘నలుగురూ నవ్విపోదురు నాకేటి సిగ్గన్న’’ చందంగా జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు
అదేదో సిన్మాలో విలన్ పాత్రధారి చేయాలి చెల్లికి మళ్లీ పెళ్లి అన్నట్లుగానే… సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో వేసిన ఫౌండేషన్లకే మళ్లీ ఫౌండేషన్లు వేస్తుండటం అందరి దృష్టిలో నవ్వులపాలు అవుతోంది. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల ఎద్దేవాలు, అవహేళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతకంతకూ హాస్యాస్పదంగా మారింది, నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయ్యింది.
తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్మోహన్ రెడ్డి మళ్లీ రెండోసారి శంకుస్థాపన చేయడమే దీనికి తాజా దృష్టాంతం..గతంలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి కూడా ఇదేకోవలో చెల్లికి మళ్లీ పెళ్లిలా శంకుస్థాపనల మీద శంకుస్థాపనలే తప్ప ఒక్క ఇటుక ముందుకు పడకపోవడం తెలిసిందే..కడప స్టీల్ ప్లాంట్ కు గతంలో సీఎం రాజశేఖర రెడ్డి ఒకసారి చేసిన శంకుస్థాపన గాలి జనార్ధన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్న దరిమిలా, రాష్ట్ర విభజనానంతరం 2018లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి శంకుస్థాపన చేశారు. 2019డిసెంబర్ 23న ఒకసారి, తాజాగా 2023ఫిబ్రవరి 15న ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు తెలిసిందే..శంకుస్థాపనలే తప్ప ఇంతవరకు అడుగు ముందుకేయలేదు. ఇప్పుడదే తరహాలో భోగాపురం ఎయిర్ పోర్టు పరిస్థితి తయారైంది..
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టుకు 2019ఫిబ్రవరి 15న చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదేరోజు విశాఖ కాపులుప్పాడలో రూ 70వేల కోట్లతో లక్ష మందికి ఉపాధి లక్ష్యంతో అదానీ డేటా సెంటర్ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో పతంజలి ఫుడ్ పార్క్ కు శంకుస్థాపన చేయడం, 172ఎకరాల్లో విజయనగరం మెడికల్ కాలేజీకి, 129ఎకరాల్లో గురజాడ వర్సిటీకి ఫౌండేషన్లు కూడా వేశారు. వాటిని త్వరితగతిన పూర్తిచేసి జాతికి అంకితం చేయాల్సివుండగా, ఆ పని చేయకుండా, వాటి పనులన్నీ ఆపేసి 4ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫౌండేషన్ల మీద ఫౌండేషన్లు వేయడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకున్నారు.
నాలుగేళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషన్ ప్రకారం భోగాపురం ఎయిర్ పోర్టు 2700ఎకరాల్లో అభివృద్ధి చేయాల్సివుండగా దాన్ని ఇప్పుడు 2200ఎకరాలకే కుదించారు. అప్పట్లో భోగాపురం ఎలా డిజైన్ చేశారంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ-380 కూడా ఈజీగా ల్యాండ్ అయ్యే విధంగా 3.8కిమీ రన్ వే ప్లాన్ చేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు నేవీ ఆధ్వర్యంలో నడుస్తోంది, పార్కింగ్ స్పేస్ లేక వచ్చిన విమానం వచ్చినట్లే వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి..వీటన్నింటికీ పరిష్కారంలా భోగాపురంలో భారీ పార్కింగ్ స్పేస్ కు ప్లానింగ్ చేశారు, మెయింటెనెన్స్ వర్క్ షాప్ కూడా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వవద్దని, తాను సీఎం కాగానే వాటిని వెనక్కి ఇచ్చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ హామీలన్నీ గాలికొదిలేసి, 4ఏళ్లు నాన్చినాన్చి ఎన్నికల ఏడాది మళ్లీ ఫౌండేషన్ కు తెరలేపడం విడ్డూరంగాక ఇంకేంటి..? అటు భూములు పోయి, ఇటు పరిహారం అందక, పునరావాస కాలనీలు పూర్తిగాక, అక్కడ మౌలిక వసతుల్లేక నిర్వాసితుల పాట్లు వర్ణనాతీతం. శంకుస్థాపనల మీద శంకుస్థాపనలే తప్ప నిర్మాణపనులేమీ ఊపందుకోక పోవడం శోచనీయం.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-18మధ్య ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆ 4ఏళ్లలోనే ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 4రెట్లు పెరగడం వెనుక అప్పటి చంద్రబాబు ప్రభుత్వ కృషి, పట్టుదలే కారణం..1.3మిలియన్ నుంచి 5.5మిలియన్లకు పాసింజర్లు పెరిగారు, సిఏజిఆర్ 38% పెరిగింది..రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విశాఖపట్నం ఒక్కటే..దానితో పాటు విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో పాటు, అప్పట్లో కేంద్ర విమానయాన శాఖమంత్రిగా అశోక్ గజపతిరాజు ఉండటం కలిసివచ్చింది. తిరుపతి, విజయవాడ ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడంతో పాటు మూడింటిని ఆధునీకరణ చేశారు. తిరుపతి రన్ వే 2280మీ నుంచి 3810మీకు పెంచారు. 3యాప్రాన్లు పూర్తిచేశారు, 4పార్కింగ్ బేలు అభివృద్ధి చేశారు. విజయవాడ టెర్మినల్ బిల్డింగ్, పార్కింగ్ బేలు పూర్తి చేశారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఎయిర్ పోర్టుల విస్తరణకు విశేష కృషి జరిగింది. కడప ఎయిర్ పోర్టుకు ప్రారంభోత్సవం చేశారు. కడప నుండి విజయవాడ, హైదరాబాద్, చెన్నైలకు విమానాలు నడిపేలా చేశారు. విజయవాడ నుంచి సింగపూర్ మధ్య వారానికి 2సార్లు అంతర్జాతీయ విమానాలు నడిపేలా చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, నెల్లూరు జిల్లాలో దగదర్తి, విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టుల అభివృద్ధికి నాంది పలికారు.
అలాంటిది జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక అన్ని అభివృద్ధి పనులు ఆపేశారు. 4ఏళ్లలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమనేది ప్రజల్లోకి ప్రబలంగా వెళ్లడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా, ఇప్పుడు వాటికి దిద్దుబాటుచర్యలు ప్రారంభించాడు, కానీ అవన్నీ కనికట్టు చర్యలే. శంకుస్థాపనల మీద శంకుస్థాపనలన్నీ నవ్వులపాలే..
జగన్ చెప్పేమాటలకు చేసే చేతలకు పొంతన లేదని, చెప్పింది చెయ్యడని, చేసేది చెప్పడనీ ఇప్పటికే అన్నివర్గాల ప్రజలకు అర్ధమైపోయింది. మాటా, మడమే కాదు మొత్తం తిప్పుడే అనేది తేటతెల్లమైంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామా అని ఎదురెదురు చూస్తున్నారు.