దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన కాంగ్రెస్.. ఏపీలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నతో తెగతెంపులు చేసుకుని తెలంగాణలో రాజకీయ భవిష్యత్తుపై కన్నేసిన షర్మిలకు కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రచారాన్ని షర్మిల మొదట కొట్టిపారేసినా.. కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు యోచిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ ఆత్మగా పేరొందిన కేవీపీ రామచంద్రరావు కూడా షర్మిల పార్టీ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన సంకేతాలిచ్చారు. వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను కాంగ్రెస్ అధినేత్రిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
మరోవైపు అన్న జగన్ తో విభేదాల కారణంగా షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించారు. అయితే కాంగ్రెస్‌లో విలీనమైనా తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని షర్మిల చెప్పినా.. ఏపీలో మాత్రం షర్మిల అవసరమని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షర్మిల ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పార్టీలో సరైన నాయకులు లేకపోవడంతో ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. షర్మిలను కాంగ్రెస్‌లో విలీనం చేసి నాయకత్వ బాధ్యతలు చేపట్టవచ్చని భావిస్తే షర్మిల ఏపీకి వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తోంది. 2009 వరకు ఏపీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. అయితే వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. దీంతో ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవాలని నాయకత్వం భావిస్తోంది. అందుకు షర్మిలకు పగ్గాలు ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం జగన్‌తో వైరంతో ఏపీని వదిలి తెలంగాణలో రాజకీయాలు చేస్తానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరుగుతున్నాయి. అంతా సవ్యంగా సాగితే వైఎస్ఆర్ వారసురాలిగా పులివెందుల నుంచి షర్మిల పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్‌తో షర్మిల చర్చలు సఫలమైతే జూలై 8న వైఎస్ఆర్ జయంతి రోజున షర్మిల పార్టీని విలీనం చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది..!!