వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలల మధ్య నెలకొన్న ఆస్తుల పంచాయతీ తారా స్థాయికి చేరింది. గడచిన ఐదేళ్లుగా అన్నాచెల్లెల్ల మధ్య ఓ మోస్తరు గొడవలు జరిగినా… అవేవీ పెద్దగా బయటకు రాలేదు. అయితే చెల్లి షర్మిలతో పాటు తల్లి వైఎస్ విజయమ్మకు రాసిన షేర్లను ఇప్పుడు వెనక్కు తీసుకుంటున్నానని జగన్ చెప్పడం, అందుకు షర్మిల ససేమిరా అనడంతో జగన్ నేరుగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్ సీఎల్ టీ)ని ఆశ్రయించడంతో పరిస్థితిొ చేయి దాటిపోయింది. నాలుగు గోడల మధ్య తెగాల్సిన ఈ పంచాయితీ రచ్చకెక్కింది. ఈ పంచాయితీని కోర్టు తీరుస్తుందా?..లేదంటే కోర్టు బయటే పరిష్కారం అవుతుందా? అన్నది పక్కనబెడితే… ఈ వ్యవహారంతో జగన్ అసలు రూపం ఏమిటన్నది బయటపడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చెల్లి అంటే కొంతవరకు ఓకే… చివరకు తల్లిని కూడా కోర్టుకు లాగడమేమిటని, అసలు తల్లిని కోర్టుకు లాగే కొడుకును ఏమంటారన్న దానిపై ఇప్పుడు విస్తృతమైన చర్చ, జరుగుతోంది.
ఇదిలా ఉంటే… తనకు, తన చెల్లికి మధ్య ఉన్న పంచాయితీ అన్ని ఇళ్లలో ఉండేదేనంటూ గురువారం గుర్లలో జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గురువారమే షర్మిల ఘాటు రిప్లై ఇచ్చారు. అన్నతో ఆస్తుల పంచాయితీని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్న విషయం తనకూ తెలుసునన్న షర్మిల… చెల్లితో పాటు తల్లిని కూడా కోర్టుకు లాగిన వ్యక్తితో నాలుగు గోడల మధ్య పంచాయితీ ఎలా పరిష్కారమవుతుందని ప్రశ్నించారు. అయినా కోర్టుల దాకా పంచాయితీని తీసుకువెళ్లింది తాను కాదని, తన సోదరుడు జగనే ఆ పని చేశారని ఆమె వాపోయిన తీరు మరింత ఆసక్తి రేకెత్తించింది. అప్పటిదాకా అన్నాచెల్లెల్ల ఈ ఆస్తుల పంచాయితీని పరిష్కరించేందుకు దగ్గరి బంధువులు యత్నించినా పలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో పంచాయితీ బజారుకెక్కాక ఇంకే బంధువు కూడా వారి మధ్య సమస్యను పరిష్కరించే సాహసం చేయరని కూడా చెప్పక తప్పదు.
జగన్ వ్యాఖ్యలకు బదులు ఇచ్చిన సందర్భంగా షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ అటాచ్ మెంట్ లో ఆస్తులు ఉన్నందున వాటి షేర్లను ఇప్పుడు బదిలీ చేయడం సాధ్యం కాదని జగన్ చెప్పిన అంశాన్ని షర్మిల కొట్టిపారేశారు. సరస్వతి పవర్ కంపెనీ షేర్లేవీ ఈడీ అటాచ్ మెంట్ లేవన్న షర్మిల,… కేవలం సరస్వతి పవర్ కు కేటాయించిన భూములను మాత్రమే ఈడీ అటాచ్ చేసిందని తెలిపారు. అంతేకాకుండా… ఇతరత్రా కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినా వాటి ట్రేడింగ్ జరుగుతూనే ఉన్న విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. మొత్తంగా ఈడీ అటాచ్ పేరిట జగన్ అండ్ కో చేస్తున్న వాదనలు పూర్తిగా అబద్ధమని షర్మిల తేల్చి చెప్పారు. ఈ లెక్కన షర్మిలతో పాటు విజయమ్మకు కూడా ఆస్తుల్లోవాటాలు ఎగ్గొట్టేందుకు జగన్ అవసరమైన అన్న కుయుక్తులు వాడుతున్నారన్న వాదనలకు బలం చూకూరింది. తల్లి, ,చెల్లి కంటే తనకు ఆస్తులే ముఖ్యమన్న రీతిలో జగన్ అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అంతిమంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి దక్కిన ఘోర పరాభవం నేపథ్యంలోనే జగన్ రక్త సంబంధాలను కూడా వీడేందుకు వెనుకాడని రీతిలో మారిపోయారని షర్మిల ఆరోపించారు. అప్పటిదాకా అన్నీ బాగానే ఉన్నా…మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాతే తనకు తాను స్వయంగా ఇస్తానని చెప్పిన షేర్లను ఇప్పుడు ఇవ్వనని జగన్ మొరాయించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా షర్మిల వ్యాఖ్యానించారు. ఓటమి తర్వాత ఆస్తులను వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని, ఈ కారణంగానే ఆయన తల్లి, చెల్లిపైనే కోర్టుకు ఎక్కారని ఆరోపించారు. భారతి సిమెంట్ తో కలిపి సరస్వతి పవర్ ను నడపాలని జగన్, భారతి నిర్ణయించుకున్నారని, ఈ కారణంగానే సరస్వతి పవర్ షేర్లను తమకు ఇచ్చేందుకు జగన్ సమ్మతించడం లేదని కూడా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చెల్లితో ఆస్తుల పంచాయితీ అన్ని ఇళ్లలో ఉన్నదేనని మాట జారిన జగన్ కు షర్మిల గట్టిగానే రిప్లై ఇచ్చారు. షర్మిల చేసిన వ్యాఖ్యలకు అసలు జగన్ వద్ద ఆన్సరే లేదన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.