వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికార కూటమి పార్టీలు వదిలిపెట్టినా…ఆయన తోడబుట్టిన చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం వదిలిపెట్టేలా లేరు. అప్పటిదాకా నాలుగు గోడలకే పరిమితమైన అన్నాచెల్లెళ్ల ఆస్తుల పంచాయతీని ఎప్పుడైతే జగన్ కోర్టు మెట్టెక్కించారో…అప్పుడే ఇక అన్నా లేదు, సున్నా లేదన్న భావనకు వచ్చేసిన షర్మిల… జగన్ పై అవసరం చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో జగన్ పై తనదైన శైలి సెటైర్లతో ఏకిపారేసిన షర్మిల…తాజాగా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్ తీరును ప్రశ్నిస్తూ నిప్పులు చెరిగారు. ప్రజలు ఎన్నుకున్నది అధికార పార్టీపై అలిగి మూలన కూర్చునేందుకు కాదని ఆమె జగన్ ను ఓ రేంజిలో ఆడుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులకు జగనే కారణమని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియాలో కొసాగుతున్న వికృత పోస్టులు, వాటిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా ఆమె జగన్ నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియాను ఓ సైతాన్ సైన్యంలా అభివర్ణించారు. ఏళ్ల తరబడి జగన్ ఓ సైతాన్ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఈ సైతాన్ సైన్యం కారణంగా తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె అన్నారు. ఈ సైతాన్ సైన్యం కారణంగా తనతో పాటు ఎందరో ఇబ్బందులు పడ్డారని కూడా ఆమె అన్నారు. విషయం తన దాకా వస్తే…జగన్ తల్లి, చెల్లి అని కూడా చూదరన్న విషయం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే తెలిసిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు.
తాను కూడా సోషల్ మీడియా వికృత చేష్టలకు బాధితురాలినేనని షర్మిల అన్నారు. తనతో పాటు తన తల్లి విజయమ్మ, బాబాయి కుమార్తె సునీతా రెడ్డిలపై స్వయంగా జగనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించారని ఆమె మండిపడ్డారు. జగన్ ప్రోద్బలంతోనే వైసీపీ యాక్టివిస్టులు తనపై పోస్టులు పెట్టారన్నారు. దమ్ముంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలన్న షర్మిల… అలా ముందుకువచ్చే ధైర్యం లేకే జగన్ అనుచరులు తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గత కొన్నేళ్లుగా జగన్ ఈ సోషల్ మీడియా సైతాన్ సైన్యాన్నిపెంచి పోషిస్తున్నారన్నారు. ఇకనైనా సోషల్ మీడియా వేధింపులకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే సోషల్ పోస్టులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తన ఇంటి సోదరీమణులకి జగన్ తన సోషల్ మీడియాలో అక్రమ సంబంధాలు అంటగట్టడం, వారి పుట్టుకనే ప్రశ్నించడంలాంటి అసభ్య, అసహ్యకర పోస్టులు పెట్టారని విరుచుకుపడ్డారు షర్మిల. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారితో పాటు వారి వెనుక వున్న వారు… అది జగన్ అయినా, అవినాశ్ రెడ్డి అయినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.