ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య నెలకొన్న ఆస్తుల పంచాయితీ రోజుల తరబడి రచ్చను రాజేస్తోంది. షర్మిల వైపు నుంచి ఆమె ఒక్కరే మీడియా ముందుకు వచ్చి పోరాడుతుంటే… వైసీపీ నుంచి మాత్రం పదుల సంఖ్యలో నేతలను జగన్ రంగంలోకి దించేశారు. అంతేకాకుండా తాను కూడా స్పందించి… ఈ రచ్చను మరింతగా పెంచేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అటు టీడీపీ గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ అస్సలు స్పందించడం లేదు. జగన్, షర్మిలల ఆస్తుల పంచాయితీతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగానే ఆ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. షర్మిల, జగన్ ల మధ్య నడిచిన ఉత్తర, ప్రత్యుత్తరాల ను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేయడం మినహా ఇక ఈ వివాదంలో ఆ పార్టీ తలదూర్చలేదనే చెప్పాలి.
చెల్లిని రోజూ తన పార్టీ నేతలతో తిట్టించడం… దానికి ప్రతిస్పందిస్తూ షర్మిల తనను నిత్యం తూలనాడుతుండటం జగన్ కు ఇబ్బందిగా పరిణమించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే షర్మిలతో ఆస్తుల వివాదానికి ఇక ముగింపు పలుకుదాం అంటూ ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వైసీపీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన మేరకు షర్మిలతో జగన్ కు ఉన్న ఆస్తుల వివాదంపై పార్టీ నుంచి ఏ ఒక్క నేత కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడరాదంటూ వైసీపీ తన శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. అదేదో ఇతర పార్టీల నేతలు ఈ వివాదాన్ని ఎగదోస్తున్నారని, తాను మాత్రం ఇప్పటిదాకా సంయమనం పాటించానన్నట్లుగా ఆ ప్రకటనలో వైసీపీ తనదైన శైలి వాదన వినిపించేలా వ్యవహరించింది. అసలు ఈ వివాదంపై తొలుత మాట్లాడింది… తొలుత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివాదాన్ని రచ్చకు ఈడ్చింది వైసీపీనే కదా. ఆ విషయాన్ని మరిచిన వైసీపీ… ఇక వివాదానికి తెర దించుతామంటూ ప్రకటన చేసింది.
వైసీపీ నుంచి రాత్రి ప్రకటన విడుదలైతే… మరునాడు ఉదయమే పార్టీ మాటను ఆ పార్టీకి చెందిన నేతే ధిక్కరించి పారేశారు. మొన్నటిదాకా వైసీపీలోనే కొనసాగిన జగన్ దగ్గరి బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… సోమావరం ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్, షర్మిలల మధ్య ఆస్తుల తగాదాను… ఇతర పార్టీలకు ఏమాత్రం సంబంధం లేనిదిగా అయన అభివర్ణించారు. అంతేకాకుండా ఈ వివాదాన్ని జగన్ తల్లి విజయమ్మే పరిష్కరించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం ఇప్పటిదాకా బయటకు రాని విజయమ్మ కొడుకు, కుమార్తెల మధ్య పంచాయితీ తెంచేందుకు అయినా బయటకు రాక తప్పదని అన్నారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైసీపీ నేతలను ఆగ్రహావేశాలకు గురిచేశాయి. పనిలో పనిగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారని పేరున్న మాజీ మంత్రి పేర్ని నాని కూడా బాలినేని వ్యాఖ్యలు విన్నంతనే ఊగిపోయినంత పనిచేశారు.
ఈ వివాదానికి తెర దించుదాం అంటూ ఆదివారం రాత్రి పార్టీ నుంచి జారీ అయిన ఆదేశాలను ధిక్కరించిన పేర్ని నాని సోమవారం నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. పార్టీ ఆదేశాలను తోసి రాజని తిరిగి జగన్, షర్మిలల ఆస్తుల పంచాయితీ మీదనే ఆయన మాట్లాడారు. అసలు బాలినేని ఎవరు ఈ వ్యవహారంపై మాట్లాడటానికి? అంటూ మొదలుపెట్టిన పేర్ని…ఈ పంచాయితీని జగన్, షర్మిలలు మాత్రమే పరిష్కరించుకోగలరని సూత్రీకరించారు. అంతేకాకుండా విజయమ్మ కాదు కదా… వైవీ సుబ్బారెడ్డి, బాలినేని ఎవరు వచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదని తేల్చి పారేశారు. ఈ సందర్భంగా విజయమ్మ షర్మిల పక్షమని చెప్పిన పేర్ని… సుబ్బారెడ్డి జగన్ పక్షమని, బాలినేని జనసేన పక్షమని తేల్చేశారు. వెరసి తల్లి విజయమ్మ కూడా జగన్ కు వ్యతిరేకమేనని పేర్ని నాని కుండ బద్దలు కొట్టేశారు.