కొద్ది రోజుల క్రితం తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి జగన్‌ను, ఆయన పార్టీని వదిలి బయటికి వచ్చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం. వైసీపీ కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మరే ఇతర ప్రధాన పార్టీలోకి ఆర్కే వెళ్లేందుకు వీల్లేదు. ఆయనకు టీడీపీ, జనసేనకు దారులు ఉండవు. కాబట్టి, ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లుగా సమాచారం. అయితే, కాంగ్రెస్ ఏపీలో 2014 నుంచి ఇప్పటి వరకూ పూర్తిగా ఉనికి కోల్పోయింది. కానీ, తాజాగా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారని విపరీతమైన ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ఈరోజే నిజం కాబోతోందని తెలుస్తోంది. అందుకే ఆర్కే కూడా ఇన్ని రోజులు తెరవెనుక మంతనాలు జరిపి.. షర్మిల వెనక నడిచేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 2024 ఏడాది మొదట్లో ప్రకటించే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ, ఆమె పేరును అధికారికంగా నేడే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. అదీకాక ఇవాళే షర్మిల ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఈ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది. నిజానికి తెలంగాణ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అనుకున్నారు. కానీ అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో షర్మిల కేవలం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు మాత్రమే ఇచ్చారు.
దీన్ని బట్టి.. వ్యూహాత్మకంగానే అప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. తాజాగా వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున.. కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో షర్మిల సమావేశం కానున్నారని సమాచారం. వైఎస్ షర్మిలను జగన్ కు పోటీగా ఏపీలో రంగంలో దించి లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఓటర్లంతా ఒకప్పుడు కాంగ్రెస్ ఓటర్లు కావడంతో వారిని తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అయితే, కాంగ్రెస్ లోకి షర్మిల చేరడం.. ఆమెను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించడం ఖాయం అనుకున్న తర్వాతే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి తాను కూడా కాంగ్రెస్ లో చేరదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఆర్కే వారికి సన్నిహితంగా ఉండేవారు. తాజాగా జగన్ తనను నమ్మిన వారిని కూడా దూరం పెడుతుండడంతో ఆర్కే బయటికి వచ్చేశారు. ఇక తన రాజకీయ ప్రయాణం వైఎస్ షర్మిలతో కొనసాగుతుందని ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి తన అనుచరులతో సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది.