వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం ఏ స్థాయిలో బరితెగించిందో తెలిపే పరిణామం ఇది. వైఎస్ షర్మిల జోరును తట్టుకోలేని నీలి సోషల్ మీడియా ఏకంగా ఆమెను, ఆమె తల్లిని నిందించేలా పోస్టులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా సొంత చెల్లి, తల్లిని కించపరిచేలా పోస్టులు చేస్తున్నా వైఎస్ జగన్ మాత్రం నోరు మెదపడం లేదు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కాలకేయుల మాదిరిగా మారిపోయిందని తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అధికార దాహం కోసం ఇంట్లోని ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని దిగజార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ విభాగం షర్మిల పుట్టుకను ప్రశ్నించేలా పోస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
జగన్ కు వ్యతిరేకంగా ఉన్నందున వైసీపీ సోషల్ మీడియాలో తనతోపాటు షర్మిల, విజయలక్ష్మిపై జరుగుతున్న దాడి, తిట్లు, బెదిరింపులను సునీత సీరియస్ గా తీసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సునీత ఈ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై సునీతా రెడ్డి ఓ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి కారణం.. ‘‘అతనో లేక ఆమెనో..’’ అంటూ సంచలనంగా స్పందించారు. దీంతో ఆ అతను, ఆమె.. వైఎస్ జగన్, భారతి రెడ్డి దంపతులేనని తేటతెల్లం అవుతోంది.
సునీత మాట్లాడుతూ.. ‘‘షర్మిల వాళ్ల నాన్నకు పుట్టలేదని కూడా వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు పెడుతున్నారు. ఇది తెలిసి కూడా షర్మిల అన్న, విజయమ్మ కుమారుడు జగన్ ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా? ఇదేనా మనం నేర్చుకున్న సంస్కారం. ఒక నాయకుడిగా ఆయన బాధ్యతలు ఏంటో ఆయనకు తెలుసు. అవి మర్చిపోయి మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఆడవాళ్లను గౌరవించాలి. కనీసం సాటి మనుషులుగా అయినా చూడాలి కదా! సొంత ఫ్యామిలీలోని వైఎస్ షర్మిలకూ, నాకే ఇలా జరుగుతుంటే ఇక రాష్ట్రంలో ఇతర ప్రజల సంగతి ఏంటో అర్థం అవుతోంది’’ అని సునీత ఆవేదన చెందారు.
పైగా ఇటీవలి కాలంలో ‘షర్మిల శాస్త్రి’ అంటూ వైసీపీ సానుభూతిపరులు అదే పనిగా సోషల్ మీడియాలో సంబోదిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా సునీత గట్టిగానే స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి జైలు పాలైన సందర్భంలో షర్మిలే పార్టీని నడిపిచిన విషయాన్ని సునీత గుర్తు చేశారు. వేలాది కిలో మీటర్లు తన అన్న కోసం పాదయాత్ర చేస్తే.. ఆమె కులం అప్పుడు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఆమె పేరు, ఎవరిని పెళ్లి చేసుకున్నారో వీళ్లకు తెలియదా? పెళ్లిచేసుకున్నంత మాత్రాన పేరు మార్చుకోవాలా? అంటూ సునీత ప్రశ్నించారు. వైఎస్ షర్మిల రాజ్యాంగ పరిధిలోనే రాజకీయ పోరాటం చేస్తోందని.. నేను తన తండ్రి హత్య కేసు విషయంలో న్యాయపోరాటం చేస్తున్నానని అన్నారు. తమ ఇద్దరి పోరాటాలు, లక్ష్యాలు వేర్వేరు అయినప్పటికీ.. షర్మిల తనకు మద్దతు ఇచ్చిందని అన్నారు. ఇపుడు షర్మిల చేస్తున్న పోరాటానికి తాను సంఘీభావం ప్రకటిస్తున్నానని సునీత అన్నారు.