మాజీ మంత్రి, జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. తాజాగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ని అక్టోబర్ 12న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అటు ఎంపీ అవినాశ్ రెడ్డిని కూడా అక్టోబర్ 14న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శివశంకర్ రెడ్డి విచారణ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగినట్లు CBI దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ప్రత్యేకంగా చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. అయితే, ఈ రూ.40 కోట్ల మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన అంతర్గత గుట్టురట్టు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగి ఉక్కుపాదం మోపుతోంది. ఆ భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ నిధులను ఎవరు సమకూర్చారు? ఎవరెవరికి ఆ నగదు చేరింది? ఈ హత్యకు అసలు సూత్రధారులు ఎవరు? రూపకల్పన చేసింది ఎవరనే కోణాలపై ED అధికారులు పూర్తిగా ఫోకస్ పెట్టారు.
ఈ దర్యాప్తులో భాగంగా ED అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పలువురు కీలక వ్యక్తులను విచారించారు. ఈ హ*త్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరితో పాటు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిలను ఇప్పటికే విచారించి పలు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా ఈ విచారణను మరింత వేగవంతం చేస్తూ కీలక నిందితులకు ED వరుస నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి విచారణ ఈ కేసులో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. ED అధికారులు ఒక్కొక్క నిందితుడిని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తుండటంతో, ఈ మనీ ల్యాండరింగ్ మూలాలు ఎక్కడి వరకు పాకాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. CBI దర్యాప్తు తర్వాత ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసి ఆర్థిక లావాదేవీలపై గట్టిగా నిఘా పెట్టడంతో, ఈ కేసులో ఉన్న నిందితులు, వైసీపీ వర్గాల్లో కలవరం మొదలైంది. రాబోయే విచారణల్లో ED ఎటువంటి సంచలన విషయాలు రాబడుతుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.











