మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి YS వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ED అధికారుల ఎదుట ఇవాళ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని ED ప్రాంతీయ కార్యాలయంలో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మూలాలపై ఈ విచారణ జరుగుతోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఈ హత్య కేవలం రాజకీయ కక్షతోనే కాకుండా భారీ ఆర్థిక ఒప్పందాల నేపథ్యంలో జరిగిందనే కోణంలో ఈడీ లోతుగా పరిశీలిస్తోంది. సీబీఐ దర్యాప్తులో వెల్లడైన కీలక అంశాల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. హత్య కోసం సుమారు రూ. 40 కోట్ల వరకు సుపారీ డీల్ కుదిరిందనే ఆరోపణలు ఉన్నాయి.ఈ భారీ మొత్తానికి సంబంధించిన నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా హంతకులకు చేరిందనే అంశంపై కూపీ లాగుతున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు పలువురు నిందితులను ED అధికారులు విచారించి వాంగ్మూలాలు సేకరించారు. వారిచ్చిన సమాచారాన్ని, CBI సేకరించిన డిజిటల్ ఆధారాలను భాస్కర్ రెడ్డి ముందుంచి అధికారులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన హవాలా, నగదు బదిలీల ప్రవాహంపై ఆయన నుంచి స్పష్టత రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి విచారణ ముగిసిన వెంటనే, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ విచారణతో వివేకా హత్య వెనుక ఉన్న ఆర్థిక మూలాలు పూర్తిగా బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రీకొడుకులను వరుసగా విచారిస్తుండటంతో ఈ కేసుకు సంబంధించిన ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. నిధుల సమకూర్పులో ఎెవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి











